హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ పరిధిలో మాస్టర్‌ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు చేపట్టాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ స్పష్టంచేశారు. మల్కాజిగిర జిల్లా పరిధిలోని పేట్‌బషీరాబాద్ ప్రాంతంలోని పలు సర్వే నంబర్లలోని భూముల నుంచి అనధికారికంగా, మాస్టర్ ప్లాన్ నిబంధనలను కాలరాసి కొందరు రియల్ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా రోడ్లను నిర్మించడంపై పలు జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి. సుదీర్ఘకాలంగా దీనిపై ఫిర్యాదుచేసినా హెచ్ఎండీఏ యంత్రాంగం స్పందించలేదు.
కానీ, తాజాగా ఈ విషయంలో మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మిస్తున్న రోడ్లను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేయడంతో ఎట్టకేలకు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ స్పందించారు. జర్నలిస్టులకు కేటాయించిన సర్వే నంబర్ 25/2 భూముల నుంచి నిర్మించిన రోడ్డు మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగానే ఉన్నదని తొలుత వాదించారు. దీనిపై పలువురు జర్నలిస్టులు ప్రశ్నించడంతో ఆ రోడ్డు మాస్టర్‌ప్లాన్‌లో లేదని తేల్చి రోడ్డును తొలగించాలని అధికారులను ఆదేశించారు.