‘హైదరాబాద్‌లోని ఖాజాగూడలో వంశీరాం బిల్డర్స్ చేపట్టిన మ్యాన్‌హట్టన్ ప్రాజెక్టు అనేది అతిపెద్ద స్కాం. ఈ ప్రాజెక్టు చెరువు బఫర్ జోన్లో ఉన్నది. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తే కనీసం రసీదు కూడా ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై అసెంబ్లీ జీరో అవర్‌లో ప్రశ్నిస్తా. ఈ వేల కోట్ల స్కాంపై అసెంబ్లీలోనే తేల్చుకుంటా!’
– కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి రెండురోజుల కిందట అసెంబ్లీలో మీడియా చిట్‌చాట్‌లో చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. రియల్ ఎస్టేట్ వర్గాలతోపాటు అధికార యంత్రాంగంలో, రాజకీయ నేతల మధ్య దీనిపైనే చర్చ జరుగుతున్నది. వంశీరాం బిల్డర్స్… హైడ్రా.. అనిరుధ్‌రెడ్డి.. అసలు ఏం జరిగింది? ఏం జరుగుతున్నది?? అంటూ ప్రముఖుల మధ్య ఒకటే గుసగుసలు. అసలేమిటీ కథ?
హైదరాబాద్‌లో అత్యంత విలువైన వెస్ట్‌సిటీలో జరుగుతున్న ఒక రియల్టీ ప్రాజెక్టు గురించి మహబూబ్‌నగర్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడుతున్నరు? హైకోర్టు తీర్పులను కూడా లెక్కచేయకుండా ‘చెరువుల పరిరక్షణ కోసం కూల్చివేతలకు’ దిగిన హైడ్రా.. నిర్దాక్షిణ్యంగా పేదల షెడ్లనూ, మధ్యతరగతి ఇండ్లను పడగొడుతున్న హైడ్రా.. ఏ ఫిర్యాదూ లేకున్నా తనంతతానుగా అక్రమాలను పసిగట్టి పంజా విసురుతున్న హైడ్రా.. అధికారపార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా ఎందుకు కార్యరంగంలోకి దుంకలేదు? అసలు అనిరుధ్‌రెడ్డి ఫిర్యాదు చేశారా? లేక ఫిర్యాదు అందినా, అందలేదని హైడ్రా చెప్తున్నదా? ఇందులో ఎవరిది నిజం.. ఎవరిది అబద్ధం?
ఇంతకీ స్కాం చేసిందెవరు? దాని వెనక ఉన్నదెవరు? ఎందుకంటే ఇది అరకొర స్కాం కాదు! ఈ నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కుదిరిన డీల్‌లో రెండున్నర లక్షల చదరపు అడుగులు అంటే సుమారు రూ.250-300 కోట్ల విలువైన స్థలం ముడుపుల కింద మారిందట! ఇంతకీ… ఆ ఇంట్రెస్టింగ్ స్కాం స్టోరీ ఏమిటో చూద్దామా!
Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/శేరిలింగంపల్లి, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ హైదరాబాద్ వెస్ట్ సిటీలో అత్యంత విలువైన ప్రాంతం. ఆ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 27లో సుమారు 64.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. 1954-55 ఖాస్రా పహాణీతోపాటు 1959-60 సంవత్సరపు రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి పొరంబోకుగా పేర్కొని ఉన్నది. 2018లో ధరణిలోనూ ఇదేవిధంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ భూమిని 22(ఏ) కింద నిషేధిత జాబితాలో పెట్టారు. 1954-55 ఖాస్రా పహాణీతోపాటు తదుపరి రికార్డుల్లోనూ ఇది పొరంబోకుగానే ఉన్నది. అయితే ఇందులో 27.18 ఎకరాల భూమి తమదంటూ వారసుల పేరిట ఆరుగురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు.
1960 వరకు ఈ భూముల రికార్డులు తమ పూర్వీకుల పేరిటనే ఉంటూ వచ్చాయని, 1961లో మాత్రం రికార్డుల్లో పొరంబోకుగా మారిందని వారు కోర్టుకు విన్నవించారు. వీరి విన్నపాన్ని పరిశీలించాలని 1986లో ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తమ పేరిట భూ రికార్డులను మార్చాలన్న వారసుల విజ్ఞప్తిని 1991లో జాయింట్ కలెక్టర్ తిరస్కరించారు. దీనిపై వారు తిరిగి ల్యాండ్ అండ్ సర్వే రికార్డుల కమిషనర్‌కు అప్పీల్ చేసుకున్నారు. 1995లో అప్పటి డీఆర్వో ఆదేశానుసారం (డి1/6770/93) రికార్డులు తమ పేరిట మార్పిడి జరిగాయని పేర్కొంటూ వారసులు ఆ భూమిని 1995లో ఐదుగురికి విక్రయించారు.
కొనుగోలు చేసిన ఐదుగురు వ్యక్తులు ఆ భూమిని ప్లాట్లుగా విభజించి విక్రయించారు. ఈ విక్రయాలు 2001 నుంచి ప్రారంభమై కొన్నేండ్లపాటు కొనసాగాయి. తర్వాత కూడా వివాదం న్యాయస్థానంలో కొనసాగినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ప్లాట్ల యజమానులంతా కలిసి ‘బేవర్లీ హిల్స్ సంక్షేమ సంఘం’గా ఏర్పడ్డారు. 2019లో ప్లాట్ల యాజమానులు, బేవర్లీ హిల్స్ సంక్షేమ సంఘంతో సోహిని ఎల్ఎల్పీ బిల్డర్స్ ‘డెవలప్మెంటు కమ్ జీపీఏ’ ఒప్పందం చేసుకున్నది. ఈ ఎల్ఎల్పీలో వంశీరాం సహా పలు సంస్థలు ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి.
ఈ వివాదాస్పద భూములు 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రభుత్వ స్వాధీనంలోనే ఉన్నాయి. ప్లాట్ల యజమానులుగానీ, డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నవారుగానీ భూమి మీదకు వెళ్లలేదు. ధరణిలోనూ ఈ భూములు నిషేధిత జాబితాలోనే కొనసాగాయి. పట్టాదారు పేర్లు ఉన్నప్పటికీ ఇవి కోర్టు వివాదాల్లో ఉన్నాయని ధరణి పోర్టల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ క్రమంలో 2022లో అప్పటి రంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారి ఒకరు గుట్టుచప్పుడు కాకుండా 27.18 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ (డీనోటిఫై) ఉత్తర్వులు (ఈ1/2970/2022) ఇచ్చారు. దీనిని ఆసరాగా చేసుకొని 2022లోనే గృహ నిర్మాణ ప్రాజెక్టు కింద జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకోగా… 2023, మార్చిలో అనుమతి మంజూరైంది. అనంతరం కూడా సదరు నిర్మాణ సంస్థ భూమి మీదకు పూర్తిగా వెళ్లలేదు. చిన్నపాటి రేకులషెడ్డు వేయడం ప్రారంభించింది.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తమ ఆటలు సాగకపోవడంతో మిన్నకుండిపోయిన సదరు నిర్మాణ సంస్థ.. అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ భూములు చెరపట్టే పని మొదలుపెట్టింది. సర్కారు భూమిని తిరిగి వశం చేసుకుని, ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు పావులు కదిపింది. ఇందులోభాగంగా వివిధ మార్గాలను అన్వేషించి.. ఎట్టకేలకు ‘ముఖ్య’నేత కోటరీ చెంతకు చేరుకున్నారు. గతంలో జరిగినదంతా వివరించి.. ఇప్పుడు ఆ భూమిని తమకిచ్చి నిర్మాణ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సహకరించాలని వారు కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దాంతో సదరు ముఖ్యనేత ఈ వ్యవహారాన్ని ‘డీల్’ చేయాల్సిందిగా ఓ అమాత్యుడికి అప్పగించినట్టు సమాచారం. ఇంకేముంది… ముఖ్యనేతనే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆ అమాత్యుడు రెచ్చిపోయాడు.
ఆ భూమిని ఇప్పించి ప్రాజెక్టును పూర్తిచేసేందుకు తాను మార్గం సుగమం చేస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సదరు నిర్మాణ సంస్థతో ఆయన బిగ్ డీల్ చేసుకున్నట్టు తెలిసింది. ప్రతిపాదిత ప్రాజెక్టులో సదరు సంస్థ 49 అంతస్తుల చొప్పున ఏడు టవర్లు నిర్మించాలని ప్రణాళికలు రచించింది. ఈ నిర్మాణ విస్తీర్ణం సుమారు 59 లక్షల చదరపు అడుగుల వరకు వస్తుంది. ఇందులో తమకు 2.5 లక్షల చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) నిర్మాణ స్థలం ఇవ్వాలని ఆయన డీల్ మాట్లాడుకున్నట్టు సమాచారం. ఈ భూములు అసలే ఐటీ కారిడార్‌లో ఉండటంతో వాటికి బహిరంగ మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్నది.
ఆ ప్రకారం ఆ అమాత్యుడు కుదుర్చుకున్న ఒప్పందంలోని 2.5 లక్షల చదరపు అడుగులు అంటే బహిరంగ మార్కెట్లో దాని విలువ సుమారు రూ.250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సదరు నిర్మాణ సంస్థకు, అమాత్యుడికి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు తదనంతరం రెవెన్యూ రికార్డుల్లోని నిషేధిత జాబితా నుంచి ఆ 27.18 ఎకరాల విస్తీర్ణాన్ని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్టు సమాచారం. ఆ తర్వాత నిర్మాణ సంస్థ గతంలో చేసుకున్న దరఖాస్తులను పరిష్కరించడంతో ఇందుకు మార్గం సుగమమైంది. గత ఏడెనిమిది నెలలుగా ఆ భూముల్లో నిర్మాణ సంస్థ పెద్దఎత్తున పనులు జరుపుతున్నది.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి రెండు రోజుల కిందట అసెంబ్లీలో మీడియా చిట్‌చాట్‌లో ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఇదో పెద్ద స్కాంగా ఆయన అభివర్ణించారు. ముఖ్యంగా తాను హైడ్రాకు ఫిర్యాదు చేసినా కనీసం రసీదు ఇవ్వలేదని ఆరోపించారు. దీనిపై హైడ్రా కూడా వివరణ ఇచ్చింది. ఖాజాగూడ తౌతోనికుంట, భగీరథమ్మ చెరువులపై హైడ్రాకు ఫిర్యాదు అందినట్టుగా పేరొన్నది. కొత్తకుంటలో వంశీరాం బిల్డర్ నిర్మాణాలు చేపడుతున్నట్టుగా ఫిర్యాదులు అందినట్టు తెలిపింది. ఇదే విషయమై హైకోర్టు నుంచి కూడా హైడ్రాకు సూచనలు వచ్చాయని, హైకోర్టు ఆదేశాలతోపాటు స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఓక్రిడ్జ్ సూల్‌కి ఎదురుగా ఉన్న కొత్తకుంటపై విచారణ చేపట్టామని వెల్లడించింది. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామని తెలిపింది.
కొత్తకుంటలోకి వర్షం నీరు రాకుండా అడ్డుగా పనివాళ్ల కోసం నిర్మించిన షెడ్లను తొలగించామని, వంశీరాం బిల్డర్స్ మ్యాన్‌హట్టన్ ప్రాజెక్టు విషయంలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నది. దీంతో అసలు ఫిర్యాదు చేయకుండానే అనిరుధ్‌రెడ్డి సదరు నిర్మాణ సంస్థను, హైడ్రాను టార్గెట్ చేశారా? లేక ఫిర్యాదు అందినా హైడ్రా దాచిపెడుతున్నదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ భూములపై రెవెన్యూ శాఖకు ఫిర్యాదులు అందినప్పటికీ ఎటూ తేల్చకుండా చాలాకాలంగా నాన్చుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఖాజాగూడలోని 27.18 ఎకరాలు గత ప్రభుత్వ హయాంలో చేతులు మారినట్టు అనిరుధ్ చెప్తున్నారు. ఆయన తెలిసి అన్నడో, తెలియక అన్నడో.. లేక ఇంకెవరైనా అలా ఆయనతో చెప్పించి ఉండవచ్చో తెలియదు కానీ అన్యాక్రాంతం కాకుండా ఆ భూమిని కాపాడిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. సీసీఎల్ఏ ఉన్నతాధికారితో విచారణ జరిపించి ప్రభుత్వ భూమిగా ప్రకటించింది. అందులోని ఆక్రమణలను తొలిగించింది.
ఎక్కడా చేతులు మారకుండా ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చింది.
క్రయవిక్రయాలకు అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ల శాఖను అప్రమత్తం చేసింది. అనుమతులివ్వకుండా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీలకు ఆదేశాలిచ్చింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ డీనోటిఫై ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఫలితంగా 27.18 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. అనిరుధ్‌రెడ్డికి ఈ విషయం తెలుసో లేదో! ఆయనకు ఇన్పుట్ ఇచ్చినవారైనా ఈ సమాచారం ఇచ్చారో, లేదో!
ఒక నిర్మాణ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా రూ.వేల కోట్ల ప్రాజెక్టును చేపడుతుందంటూ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించడం రియల్-నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపే పరిణామం. ముఖ్యంగా తాను హైడ్రాకు ఫిర్యాదు చేసినా స్పందించలేదనే కీలకమైన విమర్శ కూడా ఎమ్మెల్యే నుంచి వినిపిస్తున్నది. అయితే ఆ ఎమ్మె ల్యే తమకు ఫిర్యాదే చేయలేదని హైడ్రా అధికారికంగా ప్రకటించింది. మరి వీటిలో ఎవరిది ని జం?! గతంలో అనుమతులు ఉన్నా హైడ్రా బు ల్డోజర్లతో నేలకొరిగిన సామాన్యుల నిర్మాణాలె న్నో మన కండ్లముందే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అక్కడ వంశీరాం బిల్డర్స్ తన నిర్మాణ కార్యకలాపాలను ప్రారంభించిందనేది ఆలోచించాల్సిన విషయం.
ఎమ్మెల్యే ఆరోపణలే నిజమైతే… ఆ ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనుగోలు చేసే సామాన్యుల పరిస్థితి ఏమిటి? అసలు గుట్టు తేల్చేది ఎవరు? గతంలోనూ సాక్షాత్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకంగా సచివాలయంలో మీడి యా సమావేశం నిర్వహించి మరీ.. రూ.15వేల కోట్ల విలువైన పదకొండు నిర్మాణ ప్రాజెక్టులు అక్రమమని తీర్పునిచ్చారు. ఆయా ప్రాజెక్టుల్లో బ్యాంకు రుణా లు తెచ్చి రూ.కోట్లకు కొనుగోలు చేసిన సామాన్యులకు కంటి మీద కనుకులేకుండా పోయింది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి టార్గెట్ చేసిన వంశీరాం బిల్డర్స్ ప్రాజెక్టులో నిర్మాణ విస్తీర్ణం ఒకటీ అరా కాదు! సుమారు 59 లక్షల చదరపు అడుగులు!! అనిరుధ్‌రెడ్డి చెప్తున్నట్టు ఇది స్కామే అయితే తదుపరి వందలాది మంది అమాయకుల భవిష్యత్తు ఏమిటనే ప్రశ్నకు సమాధానమివ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే!
రంగారెడి జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఏకంగా 27.18 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టిన సమాచారం అప్పట్లోనే ప్రభుత్వ పెద్దలకు చేరింది. అప్రమత్తమైన కేసీఆర్ ప్రభుత్వం సీసీఎల్ఏ ఉన్నతాధికారి ఒకరిని రంగంలోకి దింపింది. సర్కారీ భూమిని కాపాడేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సీసీఎల్ఏ ఉన్నతాధికారి 2022లో జిల్లా ఉన్నతాధికారి డీనోటిఫై (నిషేధిత జాబితా నుంచి తొలగించిన) చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు. ఆ మేరకు ఇచ్చిన ఉత్తర్వుల్లో (ఎస్ఈటీటీ-2/211/2023, తేది: 5.8.2023) వాటిని సమగ్రంగా పేర్కొన్నారు.