నల్లగొండ : అయిటిపాముల రిజర్వాయర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటు నకిరేకల్ నియోజకవర్గ ప్రజల అదృష్టమని నకిరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం అయిటిపాముల లిఫ్ట్ ఏర్పాటుకు సంబంధించిన పనులపై ఆయన రైతులు, అధికారులు, నాయకులతో కలిసి ప్రాజెక్ట్ పరిధిలోని ఆయకట్టు గ్రామాలలో క్షేత్ర స్థాయి పర్యటన చేశారు.
మొదట కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం గ్రామంలో చెరువు వద్ద చేపట్టబోయే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు, గ్రామస్తుల సలహాలు, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కడపర్తి గ్రామ శివారులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిరేకల్ నియోజకవర్గంలో ఎక్కువ శాతం కుటుంబాలు వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నాయన్నారు.
నియోజకవర్గం నిమ్మ తోటలకు ప్రసిద్ధి చెందినదని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
సరిపడా నీరులేక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, అడిగిన ఏడు నెలల్లోపే 100 కోట్ల రూపాయలను మంజూరు చేశారని ఆయన తెలిపారు.
నియోజకవర్గ రైతుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
వారం రోజుల్లో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డితో ప్రాజెక్ట్ పనులను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. పనులను ప్రారంభించి, త్వరతగతిన పూర్తిచేసి రైతాంగానికి లాభం చేకూరుస్తామని ఆయన పేర్కొన్నారు.