ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 24: ఇతర డెయిరీలతో పోలిస్తే విజయ డెయిరీలో పాల సేకరణ ధర కనీసం రూ.పది ఎక్కువగా ఉందని, దానితోనే నష్టాలని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి పేర్కొన్నారు. సమాఖ్య చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం లాలాపేటలో విజయడెయిరీ ప్రధాన కార్యాలయంలో ఆయన తొలిసారిగా విలేకరులతో మాట్లాడారు. పాడి రైతుల శ్రేయస్సే తన ప్రథమ ప్రాధాన్యమని, విజయ డెయిరీని అగ్రగామిగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇటీవలే రూ.50 కోట్లను విజయ డెయిరీకి మంజూరు చేసిందని, రైతులకు ఉన్న బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు. యాభై ఏళ్లకుపైగా ఉన్న డెయిరీ చరిత్రలో ప్రభుత్వం నుంచి ఒకేసారి రూ.50 కోట్లు సొమ్ము విడుదల కావడం మొదటిసారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, దవాఖానలు, దేవాలయాలు, జైళ్లు, సింగరేణి, ఐసీడీఎస్ తదితర అన్ని ప్రభుత్వ సంస్థలలో విజయ డెయిరీ పాల ఉత్పత్తులే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని తెలిపారు. తిరుపతి ప్రసాదంలో నెయ్యి వివాదం తలెత్తిన నేపథ్యంలో, తాము నాణ్యమైన నెయ్యిని సరఫరా చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ టీటీడీ బోర్డుకు లేఖ రాశామని చెప్పారు. రూ.750 కోట్లుగా ఉన్న విజయ డెయిరీ టర్నోవర్‌ను రూ.1500 కోట్లకు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తానని మరోసారి స్పష్టంచేశారు.