సిద్దిపేట ప్రతినిధి, జూన్ 1(నమస్తే తెలంగాణ) : ‘బిల్లులు ఇవ్వడం లేదని సర్పంచ్‌లకు ఉత్తరం రాసుడు కాదు.. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని ఢిల్లీలోని మీ మోదీకి ఉత్తరం రాయి. ఉపాధిహామీకి సంబంధించిన రూ.1,200 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.. మా రాష్ట్ర సర్పంచ్‌లు అడుగుతున్నారని ఢిల్లీకి వెళ్లి నిధులు తీసుకొని వచ్చి మాట్లాడు’ అని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కి ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హితవుపలికారు. బుధవారం సిద్దిపేటలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ర్టానికి రూ.8,995 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నదని, వాటిలో గ్రామ పంచాయతీలు, మండలాలకు వెళ్లే నిధులు ఉన్నాయని గుర్తుచేశారు.
వాటిని ఇవ్వాలని కేంద్ర ఆర్థిక, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రులకు లేఖలు రాయాలని బండికి సూచించారు. 13వ ఆర్థిక సంఘం నుంచి రూ.1,129 కోట్లు, 14వ ఆర్థ్ధిక సంఘం నుంచి రూ. 817 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.1,103 కోట్లు, బీఆర్జీఎఫ్ కింద రూ.1,350 కోట్లు, సీసీఎస్‌కు సంబంధించి ఏపీకి తప్పుగా పంపిన రూ.450 కోట్లు , జీఎస్టీ కింద రావాల్సిన రూ.4,142 కోట్లు కేంద్రం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ఢిల్లీకి వెళ్లి మా రాష్ర్టానికి హక్కుగా రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వట్లేదని ప్రధాని మోదీని అడగాలని సూచించారు. 13, 14వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వకున్నా రాష్ట్ర ఖాజనా డబ్బులతోనే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టమని స్పష్టంచేశారు.
వివిధ సిఫార్సుల ద్వారా రూ 34,149 కోట్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ద్వారా నీతిఅయోగ్ సిఫార్సు చేసిన రూ.24,205 కోట్లలో కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదని మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘం సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద రూ.3,024 కోట్లు, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద రూ.2,350 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసినా కేంద్రం తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రూ.817 కోట్లు గ్రామాలు, పట్టణాలకు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం సూచిస్తే, అవీ ఇవ్వకుండా ఎగబెట్టారని ఆరోపించారు.
కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన రూ.34,149 కోట్లు విడుదల చేయమంటే, తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ, అమిత్‌షా వచ్చి తిట్టి పోతున్నారని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్లు చెల్లించిందని స్పష్టంచేశారు. కేవలం వారం పది రోజుల బిల్లులు మాత్రమే పెండింగ్ ఉన్నాయని, వాటిని కూడా క్లియర్ చేస్తున్నామని స్పష్టంచేశారు. పల్లె, పట్టణ ప్రగతి కింద ఇప్పటివరకు రూ.11,711 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్లడించారు.
రాష్ట్రంలోని సర్పంచ్‌లు చక్కగా పనిచేస్తున్నారని హరీశ్‌రావు కితాబు ఇచ్చారు. సర్పంచ్‌లు చేసిన ప్రతి పనికి ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తున్నదని.. కాంగ్రెస్, బీజేపీ నాయకుల ట్రాప్‌లో పడొద్దని కోరారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను అడ్డుకొని అభివృద్ధిని కొనసాగించేందుకు పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కాకుండా దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, నర్సరీలు ఉన్న ఒక్క గ్రామాన్ని చూపుతారా? అని బండి సంజయ్, రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అవార్డులు ఎందుకు రావడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
ప్రతినెలా పల్లె ప్రగతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఠంచన్‌గా రూ.256 కోట్లు విడుదల చేస్తున్నదని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టంచేశారు. 2019 నుంచి ఇప్పటివరకు ఇందుకోసం రూ.9,566 కోట్లను విడుదల చేశామని.. కాంగ్రెస్, బీజేపీలు కావాలని ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లెప్రగతి కింద చేపట్టిన పనులకు సంబంధించిన 1,31,943 చెక్కులకు రూ.571 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు.
కొన్ని పత్రికలు పూర్తి స్థాయి సమాచారం సేకరించకుండానే ప్రతిపక్ష పార్టీలకు చెందిన సర్పంచ్‌లు చెప్పిన విధంగా రాస్తున్నాయని విమర్శించారు. ఈజీఎస్ పనుల్లో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని, ఈ విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. ఉపాధిహామీ పనులకు సంబంధించి రాష్ట్రం వాటాగా ఇవ్వాల్సిన రూ.165 కోట్లు విడుదల చేశామని, కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులను పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు. ఈ నెల 3 నుంచి 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.