రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేతన్నలు చేపట్టిన రిలేదీక్షలను ఆదివారం విరమించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆధ్వర్యంలో సమీకృత కలెక్టరేట్లో మరమగ్గాల ఉత్పత్తిదారులు, ఆసాములు, కార్మిక సంఘాల నేతలు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జేఏసీ నేతలతో చర్చలు జరిపారు.
నేతన్నల డిమాండ్లను ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని విప్ హామీ ఇచ్చారు. అందుకు అంగీకరించిన జేఏసీ నేతలు దీక్షలను విరమించేందుకు అంగీకరించారు. సాయంత్రం అంబేద్కర్ చౌరస్తాలోని దీక్షా శిబిరానికి చేరుకున్న అదనపు కలెక్టర్ ఖిమ్యానాయక్ దీక్షలో కూర్చున్న నేతలకు నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు.