హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలం గాణ): ఆర్థిక రంగంలో తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతి మరోసారి దేశం ముందు సాక్షాత్కారమైంది. రాష్ర్టాల ప్రగతికి ప్రధాన ప్రామాణికాలైన జీఎస్డీపీ, తలసరి ఆదాయం లో తెలంగాణకు తిరుగులేదని తాజాగా మరో సారి రుజువైంది. ఈ రెండు అంశాల్లో ఇప్పటికే నంబర్‌వన్ స్థానానికి ఎగబాకిన తెలంగాణ.. నిరుడు (2022-23 ఆర్థిక సంవత్సరంలో) జీఎస్డీపీలో ఏకంగా 11.97 శాతం వృద్ధిరేటు ను నమోదు చేసింది.
తద్వారా తెలంగాణ దేశంలోని మరే ఇతర రాష్ర్టానికీ అందనంత ఎత్తులో నిలిచినట్టు ‘ది ఇండియన్ ఇండెక్స్’ తా జా నివేదిక వెల్లడించింది. దీంతో ‘ఆదాయాన్ని పెంచడం.. ప్రజలకు పంచడం’ అనే సీఎం కేసీఆర్ ఆర్థిక సూత్రం సూపర్‌హిట్ అయినట్టు మరోసారి రుజువైంది. ఓ వైపు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అనాలోచిత నిర్ణయాలతో దేశాన్ని ఆర్థికంగా కొలుకోలేని దెబ్బ తీస్తుంటే.. మరో వైపు సీఎం కేసీఆర్ తెలంగాణను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. అందుకు నిదర్శనమే ‘ది ఇండియన్ ఇండెక్స్’ నివేదిక. జీఎస్డీపీ వృద్ధిలో తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో నిలవడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్థిక ప్రగతికి ఇదొక నిదర్శనమని ట్వీట్ చేశారు.