Karthika Masam | హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో మంగళవారం నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు డిసెంబర్ 12 వరకు కొనసాగనున్నాయి. రద్దీ రోజుల్లో శ్రీమల్లికార్జున స్వామికి భక్తులు నిర్వహించే గర్భాలయ, సామూహిక అభిషేకాలను రద్దు చేసినట్టు ఆలయ ఈవో డీ పెద్దిరాజు తెలిపారు. శని, ఆది, సోమవారాలతోపాటు సెలవు రోజుల్లో స్పర్శ దర్శనాలను రద్దు చేశామని వెల్లడించారు.
మంగళవారం నుంచి శుక్రవారం వరకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందాలని సూచించారు. కార్తీక పౌర్ణమి నవంబర్ 27నే అయినా.. ఆ రోజు ఘడియలు మధ్యాహ్నం వరకే ఉన్నాయి. అందుకే ముందు రోజు 26న (రెండో ఆదివారం) ప్రదోష కాలంలో పౌర్ణమి ఘడియలు ప్రారంభం అవుతాయి. అందుకే 26 సాయంత్రమే కృష్ణవేణీ నదీమాతల్లికి పుణ్య నదీ హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. . పాతాళ గంగ దగ్గర ఉన్న కృష్ణవేణి విగ్రహానికి పూజాధికాలు, సారె సమర్పిస్తారు.