హైదరాబాద్, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ): ఉద్యోగాల భర్తీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అబద్ధాలు అందంగా వల్లెవేశారు. అమలు చేయని జాబ్ క్యాలెండర్‌ను అద్భుతంగా అమలు చేస్తున్నట్టు వివిధ రాష్ర్టాల ప్రతినిధుల ఎదుట గొప్పలు చెప్పారు. దీనిపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, నిపుణులు, అధికారుల రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో శనివారం పాల్గొని మాట్లాడారు. టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.
పరీక్షల్లో జాప్యం కారణంగా యువతలో నిరాశనిస్పృహలు పెరిగిపోతుంటాయని, అభ్యర్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రణాళికతో పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్లపై ఉందని సూచించారు. వార్షిక క్యాలెండర్ అమలు చేయడం ద్వారా వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుందని డిప్యూటీ సీఎం పేరొన్నారు. ప్రశ్నాపత్రాల తయారీ నుంచి తుది ఎంపిక వరకు ప్రతి దశ స్పష్టంగా, సందేహాలకు తావులేకుండా చూడాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో కమిషన్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు.పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రాజకీయ ప్రలోభాలకు లోనుకాకుండా పనిచేయాలని సూచించారు.
లోక్‌భవన్‌కు ఉపరాష్ట్రపతి
రాష్ట్ర పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శనివారం లోక్‌భవన్‌కు వెళ్లారు. ఆయనకు గవర్నర్ స్వాగతం పలికి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
పక్షపాతం వద్దు.. పారదర్శకత పెంచండి
ప్రభుత్వ నియామకాల్లో పక్షపాతాన్ని తొలగించి.. పారదర్శకతను పెంచాలని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ‘ఆలిండియా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల కాన్ఫరెన్స్’ ముగింపు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సమర్థ పాలననందించాలంటే మెరిట్ అభ్యర్థులే కాకుండా భావోద్వేగ మేధస్సు, టీం వర్క్, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్న పౌర సేవకులు అవసరమని పేర్కొన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సంస్థాగత సమగ్రతను కాపాడేందుకు ప్రయత్నించాలని సూచించారు. సంస్థల పనితీరు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, తప్పిదాలు, అక్రమాలు విశ్వసనీయతను తెబ్బతీస్తాయని పేర్కొన్నారు.