హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకొనే కమలం పార్టీలో కాసుల పంచాయితీ అగ్గిరాజేసింది. తెలంగాణ బీజేపీలో మున్సిపల్ ఎన్నికల నిధుల వ్యవహారం బజారున పడింది. నిధుల పంపిణీలో కొంతమంది ఇన్చార్జిలు చేతివాటం ప్రదర్శించారని రాష్ట్ర నాయకత్వానికి వరుసగా ఫిర్యాదులు అందడం కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ అధిష్ఠానం ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది.
ఇప్పటికే సిరిసిల్లలో ఈ విచారణ కమిటీ పర్యటించగా.. తాజాగా శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో కమిటీ సభ్యులు పర్యటించారు. ఒక్కో అభ్యర్థిని పిలిపించి పార్టీ ఫండ్ చేతికెంత అందింది అంటూ ఆరా తీశారు. సిరిసిల్లలో 39 మంది అభ్యర్థులను నిలబెట్టగా వారికి పార్టీ పంపిన ఫండ్ అందలేదని, నిధుల దుర్వినియోగం జరిగిందని రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. జగిత్యాలలో 50 వార్డులకు గానూ 46 మంది అభ్యర్థులను బరిలో దించగా.. ఒక్కొక్కరికి రూ.2,15,000 నిధులు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ.50 వేల నుంచి రూ.లక్ష మాత్రమే అందినట్టు ఆరోపణలున్నాయి. నిధుల్లో గోల్‌మాల్‌కు పాల్పడిన ఇన్చార్జిలపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చుల కోసం బీజేపీ అగ్రనాయకత్వం రాష్ట్ర శాఖకు నిధులు పంపింది. దీంతో గెలుపు అవకాశాల ఆధారంగా రాష్ట్ర నాయకత్వం మున్సిపాలిటీల్లో వార్డులను మూడు క్యాటగిరీలుగా విభజించినట్టు తెలిసింది. గెలిచే అవకాశం ఉన్న వార్డును ‘ఏ’ క్యాటగిరీగా, గట్టిగా కష్టపడితే గెలిచే అవకాశం ఉన్న వార్డును ‘బీ’ క్యాటగిరీగా, ఓడిపోతామని భావించిన వార్డును ‘సీ’ క్యాటగిరీ కింద విభజించారు. ఈ ప్రతిపాదికనే పార్టీ ఫండ్ కేటాయించాలని ఇన్చార్జిలకు ఆదేశించినట్టు సమాచారం. అయితే గెలిచే అవకాశం లేని ‘సీ’ క్యాటగిరినీ ‘ఏ’ క్యాటగిరీ కింద చూపి భారీగా నిధులు కొల్లగొట్టినట్టు పార్టీ విచారణలో తేలినట్టు సమాచారం. కొన్ని చోట్ల అభ్యర్థులకు నామమాత్రంగా నిధులు అందించి ఇన్చార్జిలు చేతులు దులుపుకున్నట్టు ఆరోపణలున్నాయి.
ఇక పార్టీ ఫండ్‌లో గోల్మాల్ అంశంపై ఇన్చార్జిలు సైలెంట్ అయిపోగా.. అభ్యర్థులు మాత్రం అప్పులు చేసి బరిలోకి దిగి భంగపడ్డామని వాపోతున్నారు. పార్టీ ఫండ్‌ను పారదర్శకంగా పంచి ఉంటే తమకు కొంతైనా ఊరట లభించేదని అంటున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం కేటాయించిన ఫండ్‌ను పక్కదారి పట్టించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పార్టీ రాష్ట్ర నాయకత్వం చెప్తున్నది. నివేదికలో దోషులుగా తేలితే వేటు ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ వివాదం ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న టెన్షన్ ఇన్చార్జిల్లో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఇదే మాదిరిగా అవకతవకలు జరిగాయని ఇటీవల బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ సైతం ఆరోపించారు. నిధుల దుర్వినియోగం అంశంపై తాను గతంలో అమిత్‌షాకు లేఖ రాసినట్టు పేర్కొన్నారు. నిధుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపితే కీలక నేతలు కొంతమంది ఇండ్లకే పరిమితం కావాల్సివస్తుందంటూ సొంత పార్టీ నేతలకు ఆయన చురకలు అంటించారు. మరి పార్టీ రాష్ట్ర నాయకత్వం మున్సిపల్ ఎన్నికల నిధుల గోల్మాల్ అంశంలో ఎలా ముందుకెళ్తుందన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. అక్రమాలకు పాల్పడిన వారిపై వేటు వేస్తారా..? లేక మందలించి వదిలేస్తారా..? అనేది తేలాల్సి ఉన్నది.