మానకొండూర్ రూరల్, మే 28 : ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి, ఆపై హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మానకొండూర్ మండలం పచ్చునూర్‌కు చెందిన గోపు ప్రశాంత్‌రెడ్డి (20)ని మంగళవారం తెల్లవారుజామున గ్రామ శివారులోని శివాలయం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు చితకబాదారు. దెబ్బలు తట్టుకోలేక పాడుబడ్డ బావిలో దూకిన ప్రశాంత్‌రెడ్డిని వారు బయటకు తీసి, కారులో తీసుకెళ్లారు.
స్థానికులు అప్పటికే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చుట్టుపక్కల గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రంకల్లా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి శివారులోని మానేరు వాగులో ప్రశాంత్‌రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి తల్లిదండ్రులు పదేండ్ల క్రితమే మరణించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.