హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు నత్తనడకన సాగుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా ఇంతవరకు 10% ఇండ్ల నిర్మాణం కూడా మొదలు కాలేదు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన నిధులకు, లబ్ధిదారులకు విడుదలైన నిధులకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేస్తున్న ఈ పథకం కింద ఇండ్లు లేనివారందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఇస్తామని వాగ్ధానం చేసిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. తొలి దశలో ఇంటి స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించి ఇస్తామని, రెండో దశలో స్థలం లేనివారికి స్థలం ఇవ్వడంతోపాటు ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పింది. ఇందులో భాగంగా తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తామని, రూ.5 లక్షలను ఒకేసారి కాకుండా 4 దశల్లో ఇస్తామని తెలిపింది. కానీ, ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినప్పటికీ తొలి విడతలో ఇవ్వాల్సిన 4.5 ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తికాలేదు. ఇప్పటివరకు ప్రభుత్వం 47, 335 ఇండ్లను మాత్రమే మంజూరు చేసింది. వాటి లబ్ధిదారులకు మొదటి, రెండో విడత వాయిదాల కింద రూ.53.64 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మొత్తం 4.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు అవసరమవుతాయి. అందులో దాదాపు రూ.6 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం, మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.
ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 82 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 20 శాతానికిపైగా దరఖాస్తులను సరైన వివరాలు లేవనే కారణంతో తిరస్కరించారు. స్థలం లేనివారిని రెండో విడత పేరుతో పక్కనపెట్టడంతో సగం దరఖాస్తులు మాత్రమే మిగిలాయి. క్షేత్రస్థాయి పరిశీలనతోపాటు బ్యాంకు ఖాతాలు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా సింహభాగం దరఖాస్తులను పక్కనపెట్టారు. నిధుల సమస్యలను కప్పిపుచ్చుకునేందుకుగాను ప్రభుత్వం ఏదో ఒక కారణంతో దరఖాస్తుల ఏరివేతే పనిగా పెట్టుకోవడం, ఇందులో రాజకీయ కోణం కూడా ఉండటంతో గ్రామాల్లో అలజడి నెలకొన్నది. కాంగ్రెస్ కార్యకర్తలను మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఒకే ఊళ్లో, ఒకే విధమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవారిలో కొందరికే ఇండ్లు మంజూరు చేయడం, మిగిలినవారిని విస్మరించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్ల పథకం గ్రామాలకే పరిమితమైంది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ‘ఇన్-సిటూ’ పద్ధతిలో ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఈ విధానంలో ప్రస్తుతం పేదలు నివసిస్తున్న ప్రాంతాలను ఖాళీ చేయించి, అక్కడే వారికి అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, అందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. వాస్తవానికి ఇందిరమ్మ ఇండ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 82 లక్షల దరఖాస్తుల్లో 10 లక్షలకుపైగా హైదరాబాద్లోనే వచ్చాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం జియాగూడ, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ‘ఇన్-సిటూ’ పద్ధతిలో డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలను నిర్మించింది. అదే తరహాలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.