ఖైరతాబాద్, సెప్టెంబర్ 12: ‘ప్రభుత్వానికి 35 ఏండ్ల పాటు సర్వీసు అందించి.. పైసా పైసా కూడపెట్టుకొని.. సొసైటీగా ఏర్పడి కొనుకున్న స్థలాన్ని తమకు సమాచారం ఇవ్వకుండానే ఎఫ్టీఎల్లో చేర్చారు.. డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్లో ఉన్న స్థలంలో నిర్మాణాలను నోటీసులివ్వకుండానే కూల్చివేశారు. ’ అని స్థల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం మీడియా సమావేశంలో సైట్ (స్మాల్ ఇండస్ట్రీస్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్) రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ చుక్కా కొండయ్య మాట్లాడుతూ.. 1992లో సైట్ ఉద్యోగలంతా సైట్ ఎంప్లాయిస్ కో ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకొని తమ సొంతింటి కల నెనవేర్చుకునేందుకు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగంపేటలో సర్వే నం. 12, 12ఏ, 13లో 24 ఎకరాలు కొనుగోలు చేశామని చెప్పారు.
అదే సంవత్సరం హుడా సొసైటీకి అనుమతినిచ్చిందని తెలిపారు. 236 మంది సభ్యులం ఇక్కడ 220 గజాల చొప్పున సొంతం చేసుకున్నామని చెప్పారు. పదవీ విరమణ పొందిన తర్వాత కొందరు ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని, ఆస్తి పన్ను, విద్యుత్, నీటి బిల్లులు కూడా చెల్లిస్తున్నామని తెలిపారు. ఈ ప్లాట్లు నీటి మట్టానికి ఎత్తులో గుట్టలపై ఉందని, 2014 వరకు ఎఫ్టీఎల్ పరిధిలో లేదని చెప్పారు. ఓ అధికారి చర్యల వల్ల తమకు తెలియకుండానే ఎఫ్టీఎల్లో చేర్చారని, అది కూడా డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్లో చేర్చినట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. దీంతో రీసర్వే చేయించాలని అనేక వినతులు ప్రభుత్వానికి పంపించామని, 2019లో విజిలెన్స్ సెల్‌ను ఆశ్రయించగా, రీసర్వే చేయాల్సిందిగా వారు సిఫారసు చేశారని తెలిపారు.
తాజాగా ఈ ఏడాది జూన్, జూలైలో సంబంధిత శాఖకు రీసర్వే కోసం లేఖ రాయగా, తాత్సారం చేశారని చెప్పారు. ఫలితంగా హైడ్రా ఈ నెల 8న ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్లో ఉన్న ఈ స్థలాన్ని నిర్ధాక్షిణ్యంగా కూల్చివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. కొన్ని సామాజిక, ప్రసార మాధ్యమాల్లో తమను కబ్జాదారులు గా చిత్రీకరిస్తున్నారని, తాము కబ్జాదారులం కాదని, ప్రభుత్వానికి సేవలందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగలమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సొసైటీ అధ్యక్షులు బీఎస్ఎస్ఎన్ రాజు, శివశంకర్, నాగేందర్, రవి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకులో అప్పు చేసి ప్లంబింగ్ వస్తువుల వ్యాపారం ప్రారంభించాను. గుట్టల బేగంపేటలో ప్లాట్ నం.189లో చిన్న షెడ్డు వేసుకొని నలుగురు పార్ట్‌నర్స్‌తో కలిసి వ్యాపారం చేస్తున్నాను. పది సంవత్సరాలుగా జీహెచ్ఎంసీకి ఆస్తి పన్ను, కరెంటు బిల్లు కడుతున్నాను. ఈ నెల 8న సుమారు కోటిన్నర విలువైన ప్లంబింగ్ మెటీరియల్ షెడ్డులోనే ఉండగా, ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే కూల్చివేశారు.
– రూపారాం చౌదరి, బాధితుడు
మా నాన్న నాగేంద్ర కుమార్ సివిల్ ఇంజినీర్. 2013లో ప్లాట్ నం.185ను గుట్టలబేగంపేటలో కొనుగోలు చేశారు. పక్కనే మా నాన్న స్నేహితుడు ప్లాట్ నం.186లో కొన్నారు. ఇద్దరూ కలిసి 2016లో జీహెచ్ఎంసీ అనుమతితో జీ+4 నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత ఈ స్థలం డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్ ఉందని తెలియడంతో హైకోర్టును ఆశ్రయించాం. కోర్టు స్టేటస్కో ఇచ్చింది. ఆ కేసు విచారణలో ఉండగానే నోటీసు ఇవ్వకుండా మా ఇంటిని కూల్చివేశారు.
– నీరద్ నున్న, బాధితుడు
2014లో ఇరిగేషన్ శాఖలో ఎస్ ఈ స్థాయి అధికారి వెయ్యి గజాలు తనకు రాసిఇవ్వాలని కోరారు. అం దుకు మా సొసైటీ నిరాకరించింది. అది మనసులో పెట్టుకొని ఈ స్థలాన్ని అదే ఏడాది ఎఫ్టీఎల్లో మార్చారు. వాస్తవానికి 2014కు ముందు ఈ స్థలం ఎఫ్టీఎల్ పరిధిలో లేదు. గుట్టలపై నీటి మట్టానికి ఎత్తులో ఉంటే ఈ స్థలం ఎఫ్టీఎల్ పరిధిలోకి ఎలా వస్తుంది?
– రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ సదానందం, బాధితుడు