Rain Update | హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం నుంచి మంగళవారం వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జూలై 10 నుంచి 15వ తేదీ మధ్యలో ఒకటి లేదా రెండు అల్పపీడనాలు ఏర్పడటం ద్వారా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జూలై 13 నుంచి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. జూలై 9 నుంచి జూలై 12 వరకు నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం వరకు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేరొంది.
మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో అకడకడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 13 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేరొంది. ఈ మేరకు 13 జిల్లాలకు ఎల్లో అలెర్డ్ను జారీ చేసింది. సోమవారం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పినపాకలో అత్యధికంగా 11.64 సెం.మీ, కరకగూడెంలో 7.22 సెం.మీ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 8.38 సెం.మీ, ఆదిలాబాద్ జిల్లా బేలలో 7.83 సెం.మీ, పెద్దపల్లి జిల్లా ముత్తారం-మంథనిలో 7.60 సెం.మీ, ములుగు జిల్లా గోవిందరావుపేటలో 7.52 సెం.మీ, మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో 7.29 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 6.98 సెం.మీ, జయశంకర్-భూపాలపల్లి జిల్లా రేగొండలో 6.48 సెం.మీ, హనుమకొండ జిల్లా ఐనోల్లో 6.07 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.