హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మణికొండ, సెప్టెంబర్ 7: (నమస్తే తెలంగాణ): చారిత్రక బుల్కాపూర్ నాలా మాయమవుతున్నది. రికార్డుల్లో పదిలంగా ఉన్న నాలా భూములు క్షేత్రస్థాయిలో అన్యాక్రాంతమవుతున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు నిర్మితం కాగా, మరికొన్ని చోట్ల వెంచర్లు వెలిశాయి. అక్కడక్కడా నాలా శిథిల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల మీదుగా ఈ బుల్కాపూర్ నాలా వెళ్తుండగా దాన్ని చెరబట్టేందుకు అధికార పార్టీ నేతలు, అధికారులు, రియల్టర్లు చేతులు కలిపారు. మట్టితో పూడ్చి వెంచర్లు వేస్తూ అమ్మకానికి పెట్టేస్తున్నారు. కొన్నిచోట్ల బుల్కాపూర్ నాలాను కాపాడామని ప్రకటించుకున్న హైడ్రా.. బడాబాబులు నిర్మించిన ఆకాశహార్మ్యాల వైపు, వెంచర్లవైపు కన్నెత్తి చూడటం లేదు. ఎందుకని అడిగితే ఫిర్యాదులు రాలేదని సాకు చెప్తున్నది.
తెరవెనుక ‘పెద్దలు’ ఉండటంతో భయపడి ఫిర్యాదుకు సామాన్యులు ముందుకు రావడంలేదు. నాలా ఆలనాపాలనా చూడాల్సిన నీటిపారుదల శాఖ ఎన్వోసీలు ఇవ్వడంలో బిజీగా ఉంటే కండ్లముందే ఆక్రమణలు కనిపిస్తున్నా హైడ్రా కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బడాబాబులు నిర్మాణాలు పూర్తి చేసి, ఆ ఫ్లాట్లను అమ్మి సొమ్ము చేసుకున్న తర్వాత, వాటిని కొనుగోలు చేసిన సామాన్యులపై హైడ్రా ప్రతాపం చూపుతుందా? అని స్థానికులు మండిపడుతున్నారు.
రూ.కోట్ల భూములు కబ్జా
రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంకర్పల్లి మండలం నుంచి ప్రారంభమై మూసీ వరకు ప్రవహించే బుల్కాపూర్ నాలా రాజేంద్రనగర్ మండల పరిధిలోని ఖానాపూర్, కోకాపేట, నార్సింగి, పుప్పాల్‌గూడ, మణికొండ గ్రామాల మీదుగా ప్రవహించేది. ఈ నాలా ఒకప్పుడు ఈ ప్రాంత వాసులకు సాగు, తాగునీరు అందించింది. నాలా నీటితో దిగువన ఉన్న చెరువులు, కుంటలు కళకళలాడేవి. ప్రస్తుతం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడ సర్వేనంబర్ 314, 416, 417, 428 తదితర భూముల మీదుగా బుల్కాపూర్ నాలా ఉన్నది.
రికార్డుల్లో పదిలంగా ఉన్నా, క్షేత్రస్థాయిలో నాలాను పూర్తిగా పూర్తిగా మూసేసి నిర్మాణాలు చేపడుతున్నట్టు స్పష్టం అవుతున్నది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని మర్రిచెట్టు కూడలి ముందు, వెనుక ప్రాంతాల్లో నాలాకు కనీసం పది అడుగుల దూరం కూడా లేకుండానే బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తమకు హెచ్ఎండీఏ అనుమతులున్నాయంటూ దబాయిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు.
నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట గ్రామ సమీపం నుంచే వెళ్లే నాలాను కబ్జాదారులు పూర్తిగా కనుమరుగు చేశారు. ఖానాపూర్ గ్రామం మీదుగా వచ్చే నాలాను కోకాపేట సెజ్ భూములను ఆనుకుని ప్రవహించే ప్రాంతంలో సర్వేనెంబర్ 84, 85 పక్క నుంచి వెళ్లే దాదాపు ఎకరం విస్తీర్ణం గల నాలా మట్టితో పూడ్చేసి వారి భూముల్లోకి వెళ్లేందుకు రహదారులుగా మార్చేశారు.
పక్కనే ఉన్న కోకాపేట చెరువు ఎప్టీఎల్ పరిధిని పూర్తిస్థాయిలో కబ్జాలు చేసి ప్రహరీ నిర్మించి ప్లాట్లుగా ఏర్పాటు చేసేందుకు మట్టితో చదును చేసి వాటిపై విల్లాలను నిర్మించారు. నిజానికి ఈ భూముల్లోకి వెళ్లేందుకు రహదారులు లేకపోవడంతో పక్కనే ఉన్న సెజ్ భూముల్లోంచి అక్రమంగా దారులను ఏర్పాటు చేసి వాటినే లే అవుట్లల్లో చూపి ప్లాటింగ్ చేశారు. వట్టినాగులపల్లి గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 257, 258ల్లోనూ నాలా పూడ్చి ఏకంగా ప్రహరీ నిర్మించారు. ఇవన్నీ అవుటర్ రింగురోడ్డు పక్కనే ఉండడంతో ఎకరా రూ.60 కోట్ల వరకు పలుకుతున్నది.
రూ.కోట్లలో కమీషన్లు
అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకుల అండదండలతో నాలా చాలా మటుకు అన్యాక్రాంతం అయ్యింది. మొన్నటిదాకా నాలాకు ఇరువైపులా 30 మీటర్లు (సుమారు వంద ఫీట్లు) బఫర్‌జోన్‌గా నిబంధనలు ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ పథకం అమలు నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిబంధనలను ఏకంగా వంద మీటర్లకు (సుమారు 330 ఫీట్లు) పెంచి, బఫర్‌జోన్‌గా అమలు చేస్తున్నది.
కానీ నాలా పరిరక్షణలో భాగంగా ఏర్పాటైయిన నిబంధనలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆక్రమణలకు రెవెన్యూ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాలాలను పూడ్చివేయడాన్ని గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా రియల్టర్లు వారిని పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఇందుకోసం రెవెన్యూ అధికారులకు రూ.కోట్లు కమీషన్లు ఇచ్చినట్టు చర్చ జరుగుతున్నది. దీంతో యథేచ్ఛగా రాత్రింభవళ్లు నాలా పూడ్చేసి రోడ్లు పోసేశారని చెప్తున్నారు.
ఫ్లాట్లు అమ్మేసిన తర్వాత కూల్చుతారా?
నగరంలోని నాలాలపై ఉన్న నిరుపేదల నిర్మాణాలను కూల్చివేసి హడావిడి చేస్తున్న హైడ్రా.. బుల్కాపూర్ నాలాపై మాత్రం పూర్తిస్థాయిలో దృష్టిసారించడం లేదు. ఇప్పటికే హైడ్రా అధికారులు బుల్కాపూర్ నాలాను పరిశీలించారు. అయినా ఆక్రమణలపై చర్యలు తీసుకోలేదు. నాలాపై అనేకచోట్ల భవంతులు నిర్మించారు. ఇప్పటికీ కొన్నిచోట్ల పనులు జరుగుతున్నాయి.
వాటిపై చర్యలు తీసుకోవాలని హైడ్రా అధికారులను అడిగితే ‘వాటిపై ఫిర్యాదులు రాలేదు’ అని సాకుగా చూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం నిర్మాణాలు బడా బాబుల చేతుల్లో ఉన్నాయని, అవి పూర్తయ్యి, ఫ్లాట్లను విక్రయించి రియల్టర్లు దర్జాగా తప్పుకున్న తర్వాత కూల్చివేతలు మొదలు పెడతారా? అప్పుడు రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేసినవారు ఆర్థికంగా కుంగిపోవాలా? అని నిలదీస్తున్నారు. కండ్ల ముందే ఆక్రమణలు జరుగుతున్నా ఫిర్యాదులు లేవని సాకులు చెప్పడంపై మతలబేంటని ప్రశ్నిస్తున్నారు.