హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): ర్యాగింగ్ వ్యవహారంలో భాగంగా 2007లో హైదరాబాద్ దారుసలాంలోని దకన్ ఇంజినీరింగ్ కాలేజీలో కాల్పులకు పాల్పడిన మహమ్మద్ ఉమీదుల్లా ఖాన్కు కింది కోర్టు పదేండ్ల జైలు శిక్షతోపాటు రూ.20 వేల జరిమానా విధించడాన్ని హైకోర్టు సమర్ధించింది.
కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉమీదుల్లా ఖాన్ దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్ పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఇటీవల తీర్పు ఇచ్చారు. కాగా, ఈ నేరాన్ని ప్రోత్సహించినట్టు ఉమీదుల్లా ఖాన్ తండ్రి కరీముల్లాఖాన్పై వచ్చిన అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవని, ఆయన నిర్ధోషి అని కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. కరీముల్లాఖాన్కు వ్యతిరేకంగా పోలీసులు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను కొట్టివేసింది.