హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు నిర్మాణాలను తొలగించాలంటూ లోకాయుక్త జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. సివిల్ వివాదాలపై విచారించి ఉత్తర్వులు జారీచేసే అధికారం లోకాయుక్తకు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ ఆదేశాలను జారీ చేసింది. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని 2015లో లోకాయుక్త జారీ చేసిన ఉత్తర్వులను సీహెచ్ హనుమంతరావు హైకోర్టులో సవాల్ చేశారు.
పిటిషనర్‌కు చెందిన 194 చదరపు గజాల స్థలంలోని 33.33 గజాలను రోడ్డు విస్తరణ పేరుతో జీహెచ్ఎంసీ తీసుకుని పరిహారం కూడా చెల్లిందని న్యాయవాది చెప్పారు. మిగిలిన స్థలంలో పిటిషనర్ ఇంటి నిర్మాణం చేస్తుంటే అంజమ్మ అనే మహిళ ఫిర్యాదు చేస్తే.. తన పరిధిలోకి రాని అంశంపై లోకాయుక్త విచారించి నిర్మాణాన్ని తొలగించాలని జీహెచ్ఎంసీకి ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. వాదనల తర్వాత హైకోర్టు, సివిల్ వివాదాలపై లోకాయక్త విచారణ చేసే పరిధి లేదని చెప్పింది. లోకాయుక్త ఉత్తర్వులను రద్దు చేసింది.