హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం కర్మన్‌ఘాట్‌లోని హనుమాన్ ఆలయ పరిధిలో ఉన్న శ్రీ బాన్సురి కృష్ణ మందిరానికి చెందిన కోట్ల విలువ చేసే 2.34 ఎకరాల భూమిలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆక్రమణల తొలగింపును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టంచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయశాఖకు నోటీసులు ఇచ్చింది. సైదాబాద్‌లోని సర్వే నంబర్ 110లోని దేవాలయ భూముల్లో ఆక్రమణల వ్యవహారంపై దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ గతంలో ఉత్తర్వులు జారీచేసింది.
వాటిని రద్దు చేయాలంటూ ఎం వెంకటేశ్ సహా 13 మంది పిటిషన్ వేశారు. వీటిని జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు మంగళవారం విచారించారు. పిటిషనర్లు 1982లో అక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకొని చట్టప్రకారం ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారని, ట్రిబ్యునల్ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాది వాదించారు. దేవాదాయశాఖ తరఫు న్యాయవాదులు సీహెచ్ సతీశ్‌కుమార్ ఇతరులు స్పందిస్తూ, అవి ఈనాం భూములని, దేవస్థానం భూమేనని ఆర్డీవో ధ్రువీకరిస్తూ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. ఆలయ భూమిని ఆక్రమించుకుని ప్లాటింగ్ చేసి ఆక్రమించుకున్నట్టు ఎండోమెంట్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పిందని పేర్కొన్నారు.