Runa Mafi | హైదరాబాద్, జనవరి 6, (నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీ అమలు వివరాలను నివేదించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీచేసింది. రేషన్‌కార్డు లేకున్నా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, కానీ తనకు రైతు రుణ మాఫీ వర్తింపజేయలేదని పేర్కొంటూ వలిగొండ మండలం జంగారెడ్డిపల్లె గ్రామస్తుడు బద్దం నర్సింహారెడ్డి పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ టీ మాధవీదేవి.. వ్యవసాయ, సహకారశాఖ ప్రధానకార్యదర్శి, కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయశాఖాధికారి, జిల్లా కలెక్టర్‌తోపాటు కెనరా బ్యాంక్ అరూర్ బ్రాంచ్ మేనేజర్లకు నోటీసులిచ్చారు.
బ్యాంకు నుంచి వ్యవసాయ రుణంగా రూ.1.5 లక్షలు తీసుకున్నానని, వడ్డీతో కలిపి రూ.1.56 లక్షలు అయ్యిందని, అయినప్పటికీ మాఫీ చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం లేదని చెప్పారు. కుటుంబసభ్యుల వివరాలు నిర్ధారణ కాలేదని చెప్పి రుణ మాఫీ అమలుచేయడం లేదని అధికారులు చెప్తున్నారని పేర్కొన్నారు. వాదనలపై స్పందించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ.. విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.