హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణకు ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) కేడర్ కేటాయింపులకు సంబంధించి దాఖలైన కేసుల విచారణను జూలై 3కి హైకోర్టు వాయిదా వేసింది. కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర సర్వీసుల అధికారుల విభజన జరిగింది.
ఈ క్రమంలో పలువురు అధికారులను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో కేసు దాఖలు చేసిన పలువురు అధికారులు మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణ ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులను రద్దు చేయాలని కేంద్రం దాఖలు చేసిన వ్యాజ్యాలను సోమవారం జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. అడిషనల్ సొలిసిటర్ జనరల్ అందుబాటులో లేరని, తమ వాదనలు వినిపించేందుకు గడువు కావాలని కేంద్రప్రభుత్వం కోరడంతో విచారణను జూలై 3కు వాయిదా వేసింది.