హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): నిజాం, పాయిగా భూములు అన్యాక్రాంతం కావడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఉన్న స్టే ఉత్తర్వులను సింగిల్ జడ్జి రద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాలు వెబ్సైట్లో లేవని ధర్మాసనం గుర్తించింది. వాటికి చెందిన ఫైళ్లను రిజిస్ట్రీ నుంచి తెప్పించుకొని విచారణ జరిపింది. భూములపై ఉన్న అన్ని రకాల ఉత్తర్వుల అమలును నిలిపివేసింది. భూములపై రిజిస్ట్రేషన్లు చేయొద్దని ప్రభుత్వానికి ఆదేశించింది. విచారణను మార్చి నెలకు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ టీ తుకారాంజీతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టులో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న నిజాం, పాయిగా (సీఎస్13, సీఎస్14) కేసులపై అవసరమైతే సీబీఐ, ఈడీల దర్యాప్తునకు ఆదేశిస్తామని చెప్పింది. రంగారెడ్డి జిల్లా కుంట్లూరు మండలంలోని పలు సర్వే నెంబర్లల్లోని సుమారు 93 ఎకరాలపై లావాదేవీలను నిర్వహించరాదన్న స్టే ఉత్తర్వులను సింగిల్ జడ్జి రద్దు చేయడాన్ని తప్పు పడుతూ దాఖలైన అప్పీళ్లను విచారించింది. కాగా, హైకోర్టు జారీ చేసే ఉత్తర్వులను అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.