హైదరాబాద్, జూన్11 (నమస్తే తెలంగాణ): సెక్స్ వరర్ సేవలను పొందే విటుడిని మానవ అక్రమ రవాణాదారు (హ్యూమన్ టాఫికర్)గా పరిగణిస్తూ కేసులు నమోదు చేయడానికి వీల్లేదని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సెక్స్ వరర్ నుంచి సేవలు పొందిన వ్యక్తికి మానవ అక్రమ రవాణా (ట్రాఫికింగ్) సెక్షన్ 370(ఎ)(2)లు వర్తించవని స్పష్టంచేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యభిచార గృహ పరిసరాల్లో ఉన్నారన్న సందేహంతో వారిపై కేసు నమోదు చేయడం చెల్లదని పేరొంది. ఇక ఇష్టపూర్వకంగా చేసే వ్యభిచారం నేరం కాదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందని గుర్తుచేసింది. అయితే మానవ అక్రమ రవాణాకు గురైన మహిళను లైంగికదోపిడీ కోసం వినియోగించే ప్రయత్నం జరిగితే కేసు నమోదు చేయవచ్చని తీర్పు చెప్పింది. వ్యభిచార గృహాల్లో పట్టుబడిన విద్యార్థులు, యువకులు, వ్యాపారవేత్తలు, ప్రైవేట్ ఉద్యోగులు తదితరులు తాము వినియోగదారులమని, తమపై వివిధ పోలీసుస్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ దాదాపు 120కిపైగా పిటిషన్లు దాఖలయ్యాయి.
వ్యభిచార గృహాలపై దాడుల్లో పట్టుబడినవారిపై ఐపీసీ సెక్షన్ 370, 370(ఎ)(2) ప్రస్తుతం బీఎన్ఎస్ 143, 144 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంపై సింగిల్ జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ కేసులను డివిజన్ బెంచ్‌కు నివేదించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావుతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించింది. సెక్స్ వరర్ సేవలను తన కోసం వినియోగించుకొనే వ్యక్తిని అక్రమ రవాణాదారుగా పరిగణించలేమని పేరొంది. ఈ సెక్షన్లను ట్రాఫికింగ్‌కు పాల్పడిన వ్యక్తులను శిక్షించడానికి తీసుకువచ్చినవని, ఇదే విషయాన్ని జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సిఫార్సుల్లో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపింది.
ఓ మహిళ పరిస్థితుల మూలంగానా లేక స్వచ్ఛందంగా ఈ వృత్తిలోకి వచ్చారా లేక బలవంతం, ప్రలోభం, అక్రమ రవాణా కారణంగా వచ్చారా అన్నది ఆయా కేసుల్లోని వాస్తవ పరిస్థితుల ఆధారంగా తేల్చాల్సిన అంశమని వ్యాఖ్యానించింది. అయితే మానవ అక్రమ రవాణాకు గురైన మహిళ అని తెలిసి, ఆమె సేవలను లైంగికదోపిడీకి వినియోగిస్తే సెక్షన్ 370(ఎ)(2) వర్తిస్తుందని స్పష్టంచేసింది. అక్రమ రవాణాకు గురైన మహిళను వినియోగించేందుకు ముందస్తు ఒప్పందం, మధ్యవర్తుల ప్రమేయం, బ్రోకర్లు, నిర్వాహకులతో ఒప్పందాలు, సంబంధాలు లాంటి పరిస్థితులుంటే ఆ మహిళ ట్రాఫికింగ్‌కు గురైన వ్యక్తిగా నిర్ధారించి కేసు నమోదు చేయవచ్చని తీర్పు వెలువరించింది.