హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రతిపాదిత హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) రోడ్ల ప్రాజక్టులో రోజుకో మార్పు చోటుచేసుకుంటున్నది. ఈ ఏడాది జూలైలో ఆమోదించిన ప్రతిపాదనలకు సవరణలు చేసి, వాటికి మంత్రివర్గం అక్టోబర్లో ఆమోదం తెలిపింది. తాజాగా ప్రభుత్వం మరికొన్ని మార్పులు, చేర్పులు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో హ్యామ్ ప్రాజక్టుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి, విస్తరణకు ప్రైవేటు భాగస్వామ్యంతో హ్యామ్ ప్రాజక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఇందులో భాగంగా రూ.6,478.33 కోట్లతో 5,190.25 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
ఇందులో 350 కి.మీ.ల మేర రోడ్ల విస్తరణ పనులతోపాటు పలు రోడ్ల మరమ్మతులు, రెన్యువల్స్, కొత్త రోడ్లు ఉన్నాయి. ఏమైందో ఏమో కొన్ని రోడ్లను జోడిస్తూ, మరికొన్ని రోడ్లను తొలగిస్తూ ఆ ప్రతిపాదనలను సవరించారు. ఈ సవరించిన ప్రతిపాదనలకు అక్టోబర్లో జరిగిన క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రూ.10,547 కోట్ల వ్యయంతో 5,566 కి.మీ.ల మేర రోడ్లను అభివృద్ధి చేయాలని నిశ్చయించారు. తాజాగా క్యాబినెట్ ఆమోదించిన ప్రతిపాదనల్లో మరోసారి సవరణలు చేస్తూ గురువారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం రూ.11,399.33 కోట్లతో 5824.27 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. గతంలో మంత్రిమండలి ఆమోదించిన 11 రోడ్లను తొలగించి, 30 కొత్త రోడ్లకు స్థానం కల్పించారు. ఇక వ్యయం రూ. 851.95 కోట్లు పెరగగా, రోడ్ల పొడవు సైతం 359.85 కిలోమీటర్ల మేర పెరగడం విశేషం. తాజాగా 419 రోడ్లను 32 ప్యాకేజీలుగా చేపట్టాలని నిర్ణయించారు. తొలగించిన 11 రోడ్ల పొడవు రూ. 101.38 కి.మీ.లు కాగా, వాటి అభివృద్ధికి ప్రతిపాదిత వ్యయం రూ.132.34కోట్లు.
రోడ్ల విషయంలో ప్రభుత్వం పదేపదే చేస్తున్న మార్పులు ప్రజల కోసమా లేక కాంట్రాక్టర్ల కోసమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిపాటు ఆర్అండ్బీ అధికారులు కసరత్తుచేసి ప్రాధాన్యతలకు అనుగుణంగా రోడ్లను ఎంపిక చేయగా, వాటిలో మాటిమాటికీ మార్పులు చేయడంలో ఆంతర్యం ఏమిటో తెలియడం లేదు. రెండుసార్లు మంత్రివర్గం ఆమోదం తెలిపిన పనుల్లో కూడా సవరణలు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లుగా ఉన్న నేపథ్యంలో అనుమానాలకు బలం చేకూరుతున్నది. ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న కాంట్రాక్టర్లకు పనుల పంపకాల్లో వాటాలను బ్యాలెన్స్ చేసేందుకే సవరణలు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం వెచ్చించాల్సిన 40 శాతం నిధుల్లో ముందుగానే కొంత మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని దశలవారీగా పనులు పూర్తయ్యేలోగా చెల్లించాలని నిర్ణయించారు. కాంట్రాక్టర్లు భరించాల్సిన 60 శాతం నిధులను ప్రభుత్వ గ్యారెంటీతో బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో సమకూర్చుకోనున్నారు.
పదిహేనేండ్లపాటు రోడ్ల నిర్వహణ కూడా కాంట్రాక్టరే చేపట్టనుండగా, ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుంది. అంటే, కాంట్రాక్టర్లు ఎక్కడా ఒక్క రూపాయి కూడా తమ జేబుల్లోనుంచి వెచ్చించకుండా, మొత్తం ప్రభుత్వం, బ్యాంకుల నుంచి రుణం ద్వారానే ఖర్చుచేసేలా ప్రణాళికలు రూపొందించారు. అందుకే కొందరు కాంట్రాక్టర్లు పనుల కోసం పోటీ పడుతున్నట్టు సమాచారం.
మరోవైపు, వర్షాలవల్ల దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేసేందుకు నిధులు లేవని చెప్తున్న సర్కారు, ఎటువంటి మతలబు లేకుండా హ్యామ్ పేరుతో ఇంత భారీ స్థాయిలో పనులు ఎలా చేపడుతుందో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం అనుయాయుకు మేలు చేయాలనుకుంటే కాంట్రాక్టర్లు కట్టబెట్టడం పెద్ద విషయమా అనే చర్చ జరుగుతున్నది.
