కొడిమ్యాల, ఏప్రిల్ 26: అధికారుల తప్పిదం ఓ మహిళకు శాపంగా మారింది. గృహజ్యోతి పథకం అందకుండా పోయింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండకు చెందిన వేములవాడ రేణుక 2024 జనవరిలో గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన సభలో గృహజ్యోతి, చేయూత పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నది. అదే ఏడాది మార్చి నుంచి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయగా, రేణుకకు వర్తించలేదు. తాము ప్రతి నెలా సగటున 50 నుంచి 100 యూనిట్లలోపు కరెంట్ మాత్రమే వాడుతుంటామని, గృహజ్యోతి ఎందుకు అమలు కావడంలేదంటూ అధికారులను ప్రశ్నించింది.
పాత దరఖాస్తు జిరాక్స్ జోడించి మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకున్నది. అధికారులు గృహజ్యోతి పోర్టల్లో డాటా ఎంట్రీ సమయంలో తనకు గృహజ్యోతి అవసరం లేదని తప్పుగా నమోదు చేసిన విషయాన్ని తనకు చెప్పకుండా ‘మీరు గృహజ్యోతి అవసరం లేదని దరఖాస్తు చేసుకున్నారని, అందుకే రావడంలేదని అధికారులు బుకాయిస్తున్నారని రేణుక ఆరోపిస్తున్నది.
అధికారుల తప్పిదానికి తాను రెండేండ్లుగా గృహజ్యోతికి దూరమయ్యానని ‘నమస్తే తెలంగాణ’తో వాపోయింది. ఈ విషయమై మండలపరిషత్ జూనియర్ అసిస్టెంట్ నిఖిలను వివరణ కోరగా, కంప్యూటర్లో రేణుకకు గృహజ్యోతి అవసరంలేదని ఎంటరై ఉందని, ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ ఇస్తే రేణుకకు న్యాయం చేస్తామని చెప్పారు.