Gruha Lakshmi | నర్సంపేట రూరల్/చెన్నారావుపేట/నల్లబెల్లి/ఖానాపురం: కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కొనసాగించడంతోపాటు లబ్ధిదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలని పలువురు లబ్ధిదారులు డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ జిల్లాలోని నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, ఖానాపురం మండలాల్లోని గృహలక్ష్మి లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను తహసీల్దార్లకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గృహలక్ష్మి పథకం లో భాగంగా అర్హులైన చాలామంది నూతన ఇంటి నిర్మాణాలు చేపట్టినట్టు తెలిపారు.
కొందరు పిల్లర్లు, మరికొందరు స్లాబ్‌లెవల్ వరకు నిర్మాణాలు పూర్తయినట్టు పేర్కొన్నారు. వాటి బిల్లులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని కొనసాగించి బిల్లులు అందేలా చూడాలని కోరారు. చెన్నారావుపేట మండలంలోని 31 గ్రామాల్లో గృహలక్ష్మి కింద ఇండ్ల నిర్మాణం ప్రారంభించిన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి బిల్లులు చెల్లించి ఆదుకోవాలని తహసీల్దార్ ఫణికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. నర్సంపేటలో వందల మంది గృహలక్ష్మి లబ్ధిదారులు ధర్నా చేసి తహసీల్దార్ విశ్వప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. నల్లబెల్లి మండలంలో 328 మంది పేదలకు బిల్లులు చెల్లించాలని తెలంగాణ ఉద్యమకారుడు బట్టు సాంబ య్య డిమాండ్ చేశారు. లబ్ధిదారులతో కలిసి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.