హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే ఈ స్థాయిలో ప్రజావ్యతిరేకత మూట గట్టుకున్న ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఎకడా లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బీఆర్ఎస్ ప్రారంభించిన ఏ ఒక పనిని, పథకాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోతున్నదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నదని చెప్పా రు. ప్రతి గ్రామంలో వాట్సాప్ గ్రూప్‌లు, సోషల్ మీడియాను సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ హయంలో ఎలా ఉన్నది? ప్రస్తు తం ఎలా ఉన్నది? అనే అంశాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నదని కార్యకర్తలకు సూచించారు.
కరెంటు కోతలు, రైతుభరోసా, మహిళలకు నెల కు రూ. 2,500 ఇవ్వకుండా ఎలా మోసం చేసారనే అంశాలను ఇప్పటి నుంచే చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో యునైటెడ్ ఫూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి, బీసీ కుల సంఘాల ప్రతినిధులు, జగిత్యాల నియోజకవర్గ నాయకులో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని, పార్టీ నుంచి కార్యకర్తలకు, స్థానిక నాయకత్వానికి సంపూర్ణ మద్ద తు ఉంటుందని కవిత భరోసానిచ్చారు. జగిత్యాలలో ఎమ్మెల్యే పార్టీ మారిన అం శంతో సంబంధం లేకుండా నియోజకవర్గంలోని గ్రామగ్రామాన గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో జగిత్యాలలో మెజారిటీ సీట్లు గెలిచేలా ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు.
ప్రస్తుతం పార్టీ మారిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ని గతంలో ప్రతి పార్టీ కార్యక్రమంలో వేదికపైకి తీసుకొచ్చి కాబో యే ఎమ్మెల్యే అంటూ ఐదేండ్ల పాటు ప్రతి గ్రామంలో తాను పరిచయం చేసిన విషయాన్ని కవిత గుర్తుచేశారు. ఓడినా వదిలేయకుండా గౌరవంగా చూసుకుంటామనే సందేశం ఇచ్చిన సభ్యత గల పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టంచేశారు. నాడు జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న జీవన్‌రెడ్డి ఎన్ని అకృత్యాలు చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలంతా ముందుండి కొట్లాడ బట్టే, గులాబీ జెండా ఎగిరిందని తెలిపారు. నేతలు పార్టీ మారి నా, కార్యకర్తలు పార్టీలోనే ఉంటారనేందుకు మంచి ఉదాహరణ జగిత్యాల నియోజకవర్గమని చెప్పారు. ‘గులాబీజెండా అంటేనే గుండె ధైర్యం’ అని తేల్చిచెప్పారు. ‘నీ కోసం తపించిన బిడ్డ కష్టాల్లో ఉండి జైల్లో ఉన్నప్పుడు దుర్మార్గానికి ఒడిగడతవా?’ అని ఎమ్మెల్యే సంజయ్‌పై మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మండిపడ్డారు. రాజకీయాలకు సంజయ్ మచ్చ తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన కవిత, కులగణనపై చర్చించారు. సోమవారం ఉదయం 11 గంటలకు కులగణన కమిషన్‌కు ఆమె రిపోర్ట్ అందజేయనున్నారు. సమావేశాల్లో జగిత్యాల జడ్పీ మాజీ అధ్యక్షురాలు దావ వసంత సురేశ్, జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, బీసీ నేతలు గట్టు రాంచందర్‌రావు, బొల్లా శివశంకర్, ఆలకుంట హరి, ఉపేందర్, మఠం భిక్షపతి, రాజారాం యాదవ్, దావ సురేశ్ పాల్గొన్నారు.