జనగామ, మార్చి 23 (నమస్తే తెలంగాణ): జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు రూ.9.08 కోట్ల నష్ట పరిహారం చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా న్యాయస్థానం జనగామ ఆర్డీవో కార్యాలయం ఫర్నిచర్, కంప్యూటర్లు, ఏసీల జప్తునకు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో బాధిత రైతు కుటుంబాలు సోమవారం ఆర్డీవో కార్యాలయ సామగ్రిని జప్తుచేసి తరలిస్తుండగా అధికారులు, సిబ్బంది అడ్డుకోవడం చర్చనీయాంశమైంది.
1981లో అప్పటి ఏపీ హౌసింగ్ బోర్డు జనగామలోని సిద్దిపేట ప్రధాన రహదారిలో సర్వే నంబర్లు 24, 26, 465లో ఉన్న 18.10 ఎకరాల భూమిని సేకరించి స్వాధీనం చేసుకున్నది. గతంలో ప్రకటించిన పరిహారం తమకు ఆమోదయోగ్యంగా లేదని బాధిత రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అర్బన్ ప్రాంతంలో ఉన్న విలువైన భూములకు నష్టపరిహారం పెంచి రూ.9.08కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు ఆదేశాలను సంబంధిత అధికారులు బేఖాతర్ చేయడంతోపాటు ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించకపోవడంతో బాధిత రైతులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో నెల రోజుల్లోపు బాధితులకు డబ్బులు ఇవ్వాలని, లేకపోతే ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేసుకునేలా జనగామ జిల్లా కోర్టుకు ఆదేశాలిచ్చింది. కోర్టు విధించిన సమయం తీరిపోవడంతో సోమవారం బాధిత రైతు కుటుంబాలు ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు.