హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తలపెట్టిన ఉద్యోగుల హక్కుల సాధన సభకు సర్కార్ అడ్డంకులు సృష్టిస్తున్నది. సభకు అనుమతుల విషయంపై తేల్చకుండా నాన్చుతున్నది. గురువారమే సభ జరగాల్సి ఉండగా.. ఇంతవరకు సభకు సర్కార్ అనుమతి ఇవ్వలేదు. అనుమతి విషయంలో తాత్సారం చేస్తున్నది. ఒక వైపు గడువు సమీపిస్తుండటం, ఇంకా అనుమతి ఇవ్వకపోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. తాము శాంతియుతంగా సభ నిర్వహించేందుకు అనుమతి కోరుతున్నా.. ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన రావడం లేదని ఎంప్లాయీస్ జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు అయిన పీఆర్సీ అమలు, డీఏలు, పెండింగ్ బిల్లుల విడుదల, సీపీఎస్ రద్దు వంటి ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎంప్లాయీస్ జేఏసీ ఈనెల 10న ‘చలో హైదరాబాద్’ను తలపెట్టింది.
సరూర్‌నగర్ స్టేడియంలో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని జేఏసీ నేతలు దరఖాస్తు చేశారు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి అనుమతిరాకపోవడంపై జేఏసీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సర్కార్ స్పందించి బుధవారం ఉదయంలోగా సరూర్‌నగర్‌లో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే రోడ్లమీదే నిరసన తెలుపాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో బుధవారం నాంపల్లిలోని టీఎన్జీవోభవన్లో జేఏసీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు జేఏసీ నేతలు వెల్లడించారు.
ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని మాజీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఆరు నెలల్లో సమస్యలు పరిషరిస్తామని చెప్పి, ప్రభుత్వం ఇప్పుడు కాలయాపన చేయడం మోసమని మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మాజీ అధ్యక్ష కార్యదర్శులు, సీనియర్ నేతలు డీ సుధాకర్, కే స్వామిగౌడ్, వీ శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్, మామిళ్ల రాజేందర్, కారం రవీందర్ రెడ్డి, హమీద్, భుజంగరావు, వేణుగోపాల్, బీ కొండల్ రెడ్డి, మైస శ్రీనివాస్ తదితరులు మంగళవారం సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరల నేపథ్యంలో ఉద్యోగుల వేతన సవరణ వెంటనే చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల భవిష్యత్ భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్న సీపీఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) పునరుద్ధరించాలని కోరారు.
సంఘాల మధ్య విభేదాలు, వ్యక్తిగత ప్రయోజనాలు పకనపెట్టి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఐక్యంగా నిలవాల్సిన సమయం ఆసన్నమైనదని పేర్కొన్నారు. సమస్యల పరిషారం కోసం ఈ నెల 10న జరిగే భారీ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులంతా లక్షలాదిగా తరలివచ్చి సత్తా చాటాలని మాజీ సంఘాల బాధ్యులు పిలుపునిచ్చారు.
ఉద్యోగుల జేఏసీ పిలుపు ఇచ్చిన ‘చలో హైదరాబాద్” మహాధర్నా కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ సమితి (టీజీ పీజాక్)పూర్తి మద్దతు ప్రకటించింది. జేఏసీ కార్యాలయంలో చైర్మన్ కే లక్ష్మయ్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. సభ్య సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు తమ శాఖల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి, ఈ నెల 10న సంఘ బ్యానర్లతో హైదరాబాద్‌కు తరలిరావాలని కోరారు.