Junk Food | హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : పాఠశాలల సమీపంలో జంక్‌ఫుడ్, మత్తుపదార్థాల విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. 100 మీటర్ల పరిధిలో ఎలాంటి జంక్ఫుడ్స్ విక్రయాలు జరుపొద్దని, డ్రగ్స్, ఆల్కహాల్, పొగాకు అమ్మకాలపై నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టంచేసింది. విద్యాలయాల్లో డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రహరీక్లబ్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఈ ఏడాది జూలై 13న జీవో విడుదల చేసింది. తల్లిదండ్రులు, పోలీసులు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులతో కలిసి ఈ క్లబ్‌ను ఏర్పాటుచేస్తారు.
పాఠశాల హెచ్ఎం క్లబ్‌కు అధ్యక్షుడిగా, సీనియర్ టీచర్ ఉపాధ్యక్షుడిగా, 6 నుంచి 10వ తరగతి వరకు క్లాసుకు ఇద్దరు చొప్పున, పీటీఏ(పేరెంట్ టీచర్ అసొసియేషన్)నుంచి ఒక ప్రతినిధి, స్థానిక పోలీసుస్టేషన్ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో పోలీసుశాఖ, ఎన్ఎస్ఎస్ వలంటీర్ల సహకారం తీసుకుంటారు. క్లబ్బుల పనితీరు, నిర్వహణపై విద్యాశాఖ సమగ్రమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. క్లబ్‌లను ఏర్పాటుచేస్తూ జీవో ఇచ్చిన రెండు నెలల తర్వాత మార్గదర్శకాలివ్వడం గమనార్హం.