Jalamandali | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): సుంకిశాల ఘటనలో నిర్లక్ష్యం వహించారంటూ అప్పటికప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్ సుదర్శన్‌పై వేటు వేసి ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేసిన ప్రభుత్వం.. 20 రోజుల క్రితం అంటే బదిలీ వేటు వేసిన మూడు నెలలకే కీలకమైన ఆపరేషన్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది. 4 రోజుల కిందట డైరెక్టర్ టెక్నికల్‌కు అదనంగా మళ్లీ ప్రాజెక్టు డైరెక్టర్-1గా బాధ్యతలు అప్పగిస్తూ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్‌రెడ్డి అంతర్గత ఉత్తర్వులు జారీ చేయ డం తీవ్ర చర్చనీయాంశమైంది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన వెంటనే హడావుడి చేసిన ప్రభుత్వం సుదర్శ న్ సహా మరో నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది. కాంట్రాక్ట్ సంస్థ మేఘా నుంచి సంజాయిషీ కోరింది.
రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో ఉన్నతస్థా యి విచారణ అంటూ హంగామా చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ఆ విషయాన్ని అటకెక్కించింది. ఇప్పటి వరకు మేఘాపై ఎలాంటి చర్యలు లేవు. అంతేకాదు, సుదర్శన్ ను ప్రాధాన్యం లేని పోస్టు నుంచి తిరిగి కీలక పోస్టులు ఇప్పించేలా తెరవెనక ‘మెగా’ ఒత్తిడి పనిచేసినట్టు తెలిసింది. అకస్మాత్తుగా ఆయన కీలక పదవిలోకి మళ్లీ రావడంపై అధికార వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతున్నది.
అమృత్-2 పథకంలో భాగంగా రూ. 3,848 కోట్ల వ్య యంతో 972 ఎంఎల్డీల సామర్థ్యంతో 39 ఎస్టీపీలకు జలమండలి టెండర్లు పిలవగా, కొందరికి లబ్ధి చేకూర్చేందుకే ఈ ఉన్నతాధికారిని తిరిగి తీసుకువచ్చారా? అన్న చర్చ బోర్డులో జోరుగా నడుస్తున్నది. సుంకిశాల ఘటనలో గోప్యత పాటించడంతో పాటు ప్రాజెక్టు డైరెక్టర్‌గా కీలకమైన స్థానంలోని ఉన్నతాధికారిదే పూర్తి బాధ్యత ఉన్నందున ప్రభుత్వం ఆయన విషయంలో కఠినంగా వ్యవహరించాలి. కానీ సదరు ఉన్నతాధికారికే రెండు కీలక పోస్టులతో పట్టం కట్టి, మిగతా నలుగురు ఇంజినీర్లను మాత్రం ఇంకా శిక్షించడం ఎంతవరకు సమంజసమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.