హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : సర్కారుపై సమరశంఖం పూరించిన ఉద్యోగుల జేఏసీని కాంగ్రెస్ సర్కార్ లైట్ తీసుకున్నది. జేఏసీ హెచ్చరికలు, కార్యాచరణను కనీసం పరిగణలోకి తీసుకోలేదు. సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో ఉద్యోగుల జేఏసీ తమ ఆందోళనల కార్యాచరణ నోటీసును గురువారం సీఎస్ రామకృష్ణారావుకు అందజేయనున్నది.
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సర్కారు వైఫల్యాన్ని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ 42 రోజుల ఉద్యమ కా ర్యాచరణను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం నుంచి పిలుపు వస్తుందని భావించిన జేఏసీ నేతలు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేదా మంత్రుల నుంచి ఆహ్వానాలొస్తాయని వేచిచూశారు. కానీ, సర్కారు నుంచి స్పందన కరువైంది. దీంతో జేఏసీ నేతలు సీఎస్‌ను కలిసి నోటీసు అందించాలని నిర్ణయించారు.