హైదరాబాద్, జనవరి 3 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై చర్చకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి సమావేశాలను సైతం బహిష్కరించింది. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పదేపదే మైక్ కట్ చేస్తుండటంతో శాసనసభ సమావేశాలను శుక్రవారం బాయ్‌కాట్ చేసిన బీఆర్ఎస్.. శనివారం ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మండలి నుంచి బయటకు వచ్చేసింది. యూరియా సమస్యపై చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్ ఉపనేత పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి శనివారం ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసును చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తిరస్కరించారు.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ సెషన్ మొత్తాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ప్రకటించారు. సభ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని మండలి ఆవరణలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అంతకుముందు మధుసూదనాచారి సభలో మాట్లాడుతూ.. రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. యూరియా కోసం రైతులు పడిగాపులుగాస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు.
రైతాంగం పట్ల కనీస గౌరవం లేని సర్కార్: మధుసూదనాచారి
తెలంగాణ రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి కనీస గౌరవం లేదని మధుసూదనాచారి విమర్శించారు. సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం మీడియా పాయింట్లో బీఆర్ఎస్ ఉపనేతలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎల్ రమణ, దాసోజు శ్రవణ్, నవీన్‌రెడ్డి, వాణీదేవి, యాదవరెడ్డి, వెంకట్రామిరెడ్డితో కలిసి మాట్లాడారు. యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుందని దుయ్యబట్టారు. బీఏసీ సమావేశంలోనే తాము యూరియా కొరతపై చర్చించాలని బీఆర్ఎస్ తరఫున పట్టుపట్టినట్టు తెలిపారు.
ప్రభుత్వం సభను నిర్వహిస్తున్న తీరు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని ఆరోపించారు. యూరియా సమస్యపై చర్చించాలని బీఆర్ఎస్ తరఫున రెండు రోజులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ నిర్దందంగా తోసిపుచ్చడం అన్యాయమని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని విమర్శించారు. యూరియా కొరతపై చర్చ జరిగితే ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందన్న భయంతోనే వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారని పేర్కొన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శాసనమండలి సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు మధుసూదనాచారి ప్రకటించారు.
పరిశ్రమలకు తరలుతున్న యూరియా: ఎల్ రమణ
రైతులకు అందాల్సిన సబ్సిడీ యూరియా పెద్ద మొత్తంలో పరిశ్రమలకు అక్రమ మార్గంలో తరలుతున్నదని బీఆర్ఎస్ ఉపనేత ఎల్ రమణ విమర్శించారు. ప్రభుత్వం తన అసమర్థత వల్ల ఈ అక్రమాన్ని అరికట్టలేకపోతున్నదని అన్నారు. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ మంత్రి కూడా నిస్సిగ్గుగా సభలో అంగీకరించడం దారుణమని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుచూపుతో రైతులకు అవసరమైన ఎరువులను కేంద్రం నుంచి తెప్పించి బఫర్‌స్టాక్ పెట్టి రైతులకు అందించిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరచి కేసీఆర్ మాదిరిగా రైతులకు అవసరమైన ఎరువులు నిల్వ పెట్టాలని డిమాండ్ చేశారు.