Panchayati Elections | హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తేతెలంగాణ) : పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోటా కేటాయింపుపై సందిగ్ధత నెలకొన్నది. ఫిబ్రవరిలోనే పూర్తిచేస్తామని సీఎం, మంత్రులు, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు చెప్తున్నారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చింది. కులగణన సర్వే, బీసీ కమిషన్ ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తామని, ప్రత్యేక కమిషన్ అవసరం లేదని మొదట సర్కారు వాదిస్తూ వచ్చింది. ప్రతిపక్షాలు, రాజ్యాంగ నిపుణులు, బీసీ సంఘాల నాయకులు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయకుండా కోటా ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పారు. దీంతో నవంబర్ 4న భూసాని వెంకటేశ్వర్రావు నేతృత్వంలో డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెలరోజుల్లోనే కమిషన్ నివేదిక సిద్ధం చేయాలని సూచించినప్పటికీ డిసెంబర్ చివరి వారం వచ్చినా అందలేదు.
రాష్ట్రాలు తమకు నచ్చిన రీతిలో రిజర్వేషన్లు కేటాయిస్తుడంతో సుప్రీంకోర్టు ట్రిపుల్ టీ మార్గదర్శకాలు విడుదల చేసింది. బీసీ రిజర్వేషన్లకు డెడికేషన్ ఏర్పాటుచేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాల రిజర్వేషన్ల కోటా 50 శాతం మించరాదని నిర్దేశించింది. దీని ప్రకారం బీసీలకు 42 శాతం కోటా కేటాయిస్తే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను కలుపుకొంటే 64 శాతం మించిపోయే అవకాశం ఉం టుంది. రాజ్యాంగం ప్రకారం జనాభా, కులగణన చేపట్టే అధికారం కేంద్రానికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఏదేని రాష్ట్రంలో నిర్వహించాలంటే కేంద్రం నియమించే నోడల్ అధికారి నేతృత్వంలో ఈ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది.