హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): గురుకుల రిక్రూట్మెంట్లో డౌన్ మెరిట్‌ను అమలు చేసి, బ్యాక్‌లాగ్‌లు లేకుండా చూసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న గురుకుల అభ్యర్థులపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. ఎక్కడికక్కడ అరెస్టులకు తెగబడుతున్నది. గురుకుల నియామకంలో డౌన్ మెరిట్ విధానాన్ని అమలు చేయకపోవడం వల్ల నోటిఫికేషన్లో పేర్కొన్న 9,210 పోస్టుల్లో 3,000కుపైగా పోస్టులు మిగిలిపోయే ప్రమాదముందని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ విషయమై 4నెలలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. పలుమార్లు సీఎం ఇంటి ఎదుట కూడా నిరసనకు దిగారు. అయినప్పటికీ స్పష్టమైన హామీ రాకపోవడంతో శనివారం ఉదయం మాసాబ్‌ట్యాంక్‌లోని డీఎస్ఎస్ భవన్‌లోని ట్రిబ్ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించారు. సమాచారం అందుకున్న పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా గురుకుల అభ్యర్థులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. మల్సూర్ యాదవ్, అస్మా, నవీన్ పట్నాయక్, శ్రీనివాస్, రజినీకాంత్ తదితర అభ్యర్థులను ముందస్తుగానే గృహనిర్బంధం చేశారు. అయినప్పటికీ పోలీసులను తప్పించుకుని 200మంది డీఎస్ఎస్ భవన్‌కు చేరుకున్నారు. ‘వుయ్ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు అక్కడికి చేరుకుని అభ్యర్థులను బస్సుల్లో ఎక్కించి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించి, సాయంత్రం విడుదల చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.