ఖిలావరంగల్, నవంబర్ 18 : చారిత్రక ఖిలావరంగల్ కోటను సందర్శించే పర్యాటకులు ఇకపై కాకతీయుల చరిత్ర, కోట విశేషాలను సులభంగా తెలుసుకునేందుకు వీలుగా కేంద్ర పురావస్తుశాఖ కీలక చర్యలు చేపట్టింది. కోటలోని కట్టడాల వద్ద తాజాగా శాశ్వత ప్రాతిపదికన క్యూఆర్ (QR) కోడ్లతో కూడిన పోల్స్‌ను ఏర్పాటు చేశారు.
టెక్నాలజీతో చరిత్ర పఠనం
గతంలో తాత్కాలికంగా కట్టడాలపై అతికించిన క్యూఆర్ కోడ్లకు బదులుగా, ఇప్పుడు ప్రత్యేక లోహంతో తయారు చేసిన శాశ్వత పోల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి పోల్‌ను చారిత్రక కీర్తి తోరణాల నడుమ బిగించారు. పర్యాటకులు తమ మొబైల్ ఫోన్ లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో సమాచారం తెలుసుకునే వెసులుబాటును కేంద్ర పురావస్తు శాఖ కల్పించింది. ఇకనుంచి పర్యాటకులు తమ వెంట తెచ్చుకున్న ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ తో కోటలోని అన్ని చారిత్రక కట్టడాలు, ఆలయాల విశేషాలు, చరిత్రను స్వతహాగా తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇతర పర్యాటక ప్రాంతాల వివరాలు
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి జిల్లాలో లేదా కోటలో గాని పర్యాటకులు సెలెక్ట్ చేసుకున్న కట్టడాలను వీక్షించేందుకు గూగుల్ మ్యాప్ ద్వారా లొకేషన్ కు వెళ్లే మార్గం, దూరం వంటి వివరాలు తెలుసుకోవచ్చు.
కేంద్ర పురావస్తుశాఖ తీసుకున్న ఈ సాంకేతిక చర్యకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా విదేశీ పర్యాటకులు ఈ QR కోడ్ల ద్వారా చరిత్ర తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
స్విట్జర్లాండ్ నుండి మంగళవారం వరంగల్ కోట సందర్శనకు వచ్చిన పర్యాటకులు కూడా, తాజాగా ఏర్పాటు చేసిన QR కోడ్ల ద్వారా కోట చరిత్రను తెలుసుకున్నారు. గైడ్ సహకారం లేకుండానే చరిత్రను ఆలయాల కట్టడాల విశేషాలు తెలుసుకొని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఖిలా వరంగల్ కోటలో చరిత్రను, ఆధునిక సాంకేతికతను మేళవించిన ఈ కొత్త ప్రయత్నం పర్యాటక రంగానికి మరింత ఊపునిస్తుందని స్థానికులు, పర్యటకులు భావిస్తున్నారు.