హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలిస్తున్నాం. ఇది సర్కారుపెద్దలు (Congress Govt) చెప్పేమాట. కానీ, రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒకటో తేదీన వేతనం పొందక నెలలు కావస్తున్నది. రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి రెండేైండ్లెనా పరిస్థితిలో మార్పురాకపోవడంతో పలు శాఖల్లోని చిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సమగ్రశిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు 20 రోజులు ఆలస్యంగా ఒకనెల వేతనాలు మాత్రమే ఇచ్చారు. సమ్మె కాలానికి వేతనం ఇస్తామన్న హామీ ఇంతవరకు నెరవేరనేలేదు. సకాలంలో వేతనాలందక ఆయా ఉద్యోగులంతా రోజువారీ ఖర్చుల కోసం అష్టకష్టాలుపడుతున్నారు. ఒక్కో శాఖలో 6 నుంచి 8 నెలల వేతనాలు పెండింగ్ ఉండడంతో తమ కుటుంబాలు అర్థాకలితో అలమటిస్తున్నాయని వాపోతున్నారు.
రాష్ట్రంలో అన్నిప్రభుత్వ శాఖల్లో నాలుగు లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. హెచ్వోడీలు, ప్రధాన కార్యాలయాలు, జిల్లా, మండల కార్యాలయాలు, క్షేత్రస్థాయిలో ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం, హానరోరియం, కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీరంతా పనిచేస్తున్నారు. కొన్ని ప్రభుత్వశాఖలు నేరుగా వీరిని నియమించుకోగా, మరికొన్ని శాఖలు జిల్లాల వారీగా మ్యాన్‌పవర్ ఏజెన్సీల ద్వారా నియామకం చేసుకున్నాయి. కొన్ని ఏజెన్సీలు నిర్దేశిత సంఖ్యలో నియమించకుండా లక్షలు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా పీఎఫ్, ఈఎస్ఐ వంటివి కూడా తమ ఖాతాల్లో జమచేయకుండా వ్యక్తిగతంగా వాడుకుంటున్నట్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.