హైదరాబాద్, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ): దేవాదాయ శాఖలో 33మంది జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్- 3 ఈవోలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. శనివారం సచివాలయంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రంలో మంత్రి కొండా సురేఖ ఉద్యోగులకు పదోన్నతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 33 మంది జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్- 3 ఈవోలుగా ప్రమోషన్ పత్రాలు అందివ్వడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇప్పటికే గ్రేడ్ -1, గ్రేడ్ -2 ఈవోలుగా పలువురికి ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. ఉద్యోగులు దేవాలయాల అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. దేవాదాయ శాఖ భూముల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి, జియో ట్యాగింగ్‌తో ప్రభుత్వం కట్టుదిట్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నదని అన్నారు. కోర్టు కేసుల్లో వున్న దేవాలయ భూములకు విముక్తి ప్రసాదించేందుకు దేవాదాయ శాఖ త్వరలో లీగల్ ఆఫీసర్‌ను నియమించనుందని వివరించారు.