SSC Memo | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి మార్కుల మెమోలను ఎలా ముద్రించాలన్న అంశానికి సర్కారు ఎట్టకేలకు తెరదించింది. 2024-25 విద్యాసంవత్సరానికి పదో తరగతి మెమోలపై మార్కులతోపాటు గ్రేడ్స్‌ను సైతం ముద్రించాలని నిర్ణయించింది. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా తాజాగా ఉత్తర్వులు విడుదలచేశారు. పదో తరగతిలో ఈ విద్యాసంవత్సరం నుంచి గ్రేడింగ్ విధానాన్ని తీసేశారు. గ్రేడ్లస్థానంలో మార్కుల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇంటర్నల్స్‌ను రద్దుచేయాలని తీసుకున్న నిర్ణయం ఆల స్యం కావడంతో ఈ ఒక్క ఏడాదికి ఇంటర్నల్స్ ఉంటాయని ప్రకటించారు. మెమోలపై మార్కులు ఎలా ముద్రించాలన్న అంశంపై ఏర్పాటు చేసిన కమిటీ పలు సిఫారసులు చేసింది. దీంతో ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. రెండు, మూడు రోజుల్లో ఫలితాలు విడుదల కానున్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగును ప్రథమ భాషగా బోధించాలని పలువురు విద్యావేత్తలు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలు గు భాషా పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి ఆదివారం రౌండ్ టేబుల్ సమావే శం నిర్వహించింది. వక్తలు మాట్లాడుతూ ఇంటర్మీడియట్లో సంస్కృతాన్ని దేవనాగరి లిపిలోనే పరీక్ష రాసేలా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగు భాషా పరిరక్షణకు కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని, ప్రభుత్వ ఉత్తర్వులు కూడా తెలుగులోనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ చింతకింది కాశీం, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి, ఎమ్మెల్సీ కోదండరామ్, విద్యావేత్తలు పాల్గొన్నారు.