
హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): గతంలో పాఠశాల విద్యార్థుల్లో జాతీయ భావాలు, సామాజిక చైతన్య దృక్పథాలు పెంపొందించేందుకు పిల్లలను ఉపాధ్యాయులు ‘రేపటి పౌరులు, వందేమాతరం’ వంటి సినిమాలకు తీసుకెళ్లేవారు. తాజాగా చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఈ తరహా నిర్ణయమే తీసుకున్నది. విజేతల జీవితగాథలు, సామాజిక ఇతివృత్తాలు, చరిత్రలో నమోదైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలను వర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ప్రదర్శించి చర్చ పెట్టి విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని నిర్ణయించింది. ఠాగూర్ ఆడిటోరియంలో ఇప్పటికే ‘ఇన్విక్టస్’ సినిమాను ప్రదర్శించారు. ఈ నెల 28న మరో సినిమాను ప్రదర్శించనున్నారు. ఇలా నెలకో సినిమా చూపించనున్నారు. ప్రదర్శన పూర్తికాగానే.. విద్యార్థుల మధ్య చర్చ పెట్టనున్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు, సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు ఇది దోహదపడుతుందని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ తెలిపారు. గతంలో తాము చదువుకునే రోజుల్లో ఓయూలో సినిమాలను ప్రదర్శించేవారిని, పాత సంప్రదాయాన్ని కొనసాగించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సినిమాలను ప్రదర్శిస్తున్నారని, ప్రదర్శన తర్వాత నిర్వహించే చర్చల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు.