హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): గ్రామీణ సమస్యల పరిష్కారంలో కాలేజీ యువతను భాగస్వాములను చేస్తూ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ), విద్యాశాఖ, యునిసెఫ్ ఇండియా, ఇంక్వి-ల్యాబ్ ఫౌండేషన్, యువా సంయుక్తంగా ‘యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్’ కార్యక్రమాన్ని చేపట్టాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మంగళవారం హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. కళాశాల స్థాయిలోనే విద్యార్థుల్లో సంపూర్ణ నైపుణ్యాలను పెంపొందించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
నూతన ఆవిష్కరణలతో గ్రామీణ ప్రజల సమస్యలకు పరిష్కారాన్ని చూపడంతోపాటు విద్యార్థులను మరింత శక్తిమంతంగా తయారు చేసేందుకు ‘యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్’ దోహదపడుతుందన్నారు. విద్యార్థులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి సమస్యలపై అధ్యయనం చేయడంతోపాటు, వాటికి తగిన పరిష్కారాలను చూపేలా కొత్త ఆవిష్కరణలను తీసుకురావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాల యునిసెఫ్ చీఫ్ ఫీల్డ్ ఆఫీసర్ మీటల్ రుస్దియా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలవుతుందని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తౌటం, ఇంక్వి-ల్యాబ్ ఫాండేషన్ డైరెక్టర్ వివేక్ పిద్దెంపల్లి తదితరులు పాల్గొన్నారు.