Future innovators fair | సంగారెడ్డి, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ‘ఫ్యూచర్ ఇన్నోవేషన్ ఫెయిర్-2023’ సందడిగా జరిగింది. రాష్ట్రంలోని 22 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. వీటిని ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ప్రొఫెసర్లు పరిశీలించారు. ఇందులో మూడు బహుమతులతోపాటు మరో రెండు ఆవిష్కరణలకు కన్సోలేషన్ బహుమతులు ప్రకటించారు. శుక్రవారం ఐఐటీ హైదరాబాద్ 15వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయనున్నారు.
కామారెడ్డి జిల్లా ఇసాయిపేట జడ్పీహెచ్ఎస్కు చెందిన 8వ తరగతి విద్యార్థులు డీ సాకేత్, పీ హర్షవర్ధన్, ప్రణయ్, రక్షిత్, నవీన్.. ‘సోలార్ హ్యాండ్ డిష్ వాషర్’ను ఆవిష్కరించగా మొదటి బహుమతికి ఎంపికైంది. మోటరు, పైప్, స్క్రబ్బర్, సోలార్ ప్యానల్‌ను ఉపయోగించి హ్యాండ్ డిష్ వాషర్‌ను తయారు చేశారు. వాషర్ దిగువ భాగంలో స్క్రబ్బర్ ఉంటుంది. మెషిన్‌ను స్టార్ట్ చేసి పాత్రలు, పేట్లపై హ్యాండ్ డిష్వాషర్ పెట్టగానే అది శుభ్రం చేస్తుంది.
హైదరాబాద్ బోడుప్పల్‌లోని పల్లవి స్కూల్‌కు చెందిన పదోతరగతి విద్యార్థులు పర్యావరణహిత శానిటీ ప్యాడ్స్‌ను రూపొందించగా రెండో బహు మతి లభించింది. ఉండే అరటి కాండం నార, పత్తి, వేప, మక్కజొన్న స్టార్చ్‌తో పర్యావరణహిత శానిటరీ ప్యాడ్స్ తయారు చేసినట్టు చెప్పారు.
రామంతాపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు విపత్తు నియంత్రణ డ్రాయిడ్ను రూపొందించగా మూడో బహుమతి దక్కింది. భవనాల్లో చోటుచేసుకునే అగ్ని ప్రమాదాలు, ప్రాణనష్టం నివారించేలా సెన్సర్లతో రూపొందించారు.