హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో తెలంగాణ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే గత రెండు విడతల రుణాల పంపిణీలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణ.. మూడో విడతలోనూ తొలి రుణాన్ని అందించిన రాష్ట్రంగా రికార్డులకు ఎక్కింది. రెండో విడతలో తీసుకొన్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించినవారికి మూడో విడతలో రూ.50 వేల రుణాన్ని అందిస్తున్నారు. దీన్ని 36 నెలల్లో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించారు. పట్టణ ప్రగతిలో భాగంగా వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించడంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2024 డిసెంబర్ వరకు రుణాలు అందజేయనున్నారు.
రెండో విడతలో 61 వేల మందికి రుణాలు
రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.52 లక్షల మందికి రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు 61 వేల మందికి అందించారు. దీంతో తెలంగాణ మరోసారి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. లక్ష లోపు జనాభా ఉన్న పట్టణాల క్యాటగిరీలో టాప్-10 పట్టణాలు తెలంగాణవే ఉండటంతో రాష్ట్రం ఈ ఘనత సాధించింది. లక్ష నుంచి 10 లక్షల జనాభా ఉన్న టాప్-10 పట్టణాల జాబితాలో సైతం మన రాష్ర్టానికి చెందివే 6 ఉన్నాయి. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, రామగుండం ఈ జాబితాలో చోటు దక్కించుకొన్నాయి. అంతేకాకుండా 40 లక్షలకుపైగా జనాభా ఉన్న టాప్-10 నగరాల జాబితాలో హైదరాబాద్ ముందున్నది. వీధి వ్యాపారులకు వ్యాపార వసతి సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్రంలో 618 స్ట్రీట్ వెండింగ్ జోన్స్‌ను ఏర్పాటు చేసి 2,561 షెడ్లు నిర్మిస్తున్నారు. వీటిలో ఇప్పటికే 1,259 షెడ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 1,392 షెడ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి.
వడ్డీ వ్యాపారుల నుంచి రక్షణ
వీధి వ్యాపారులు రోజువారీగా సరుకులు కొని విక్రయిస్తుంటారు. వారికి అవసరమైన డబ్బులను వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకొంటుండటంతో వచ్చిన లాభాలు వడ్డీకే సరిపోతుంటాయి. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడం, డిజిటల్ లావాదేవీలు జరిపేవారిని ప్రోత్సహించడం ద్వారా వీధి వ్యాపారులను ఆర్థికంగా ఆదుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే వీధి వ్యాపారుల ఖాతాలో నెలకు రూ.100 చొప్పున జమ చేస్తారు. ఈ విధానానికి వీధి వ్యాపారుల నుంచి కూడా మంచి స్పందన రావడంతో మొదటి విడతలో రూ.10వేలు, రెండో విడతలో రూ.20 వేలు చొప్పున ఇచ్చారు.