Iran War Secrets | అమెరికా–ఇరాన్ యుద్ధానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని మీడియాకు ఎవరు లీక్ చేస్తున్నారు? అమెరికా రక్షణ శాఖలో ఇప్పుడు ఇదే ప్రశ్న కలకలం రేపుతోంది. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా కీలక ఆయుధాల నిల్వలు తగ్గిపోతున్నాయంటూ వరుస కథనాలు వెలువడటంతో.. వాటి మూలాలను గుర్తించేందుకు అమెరికా రక్షణ మంత్రిత్వ కార్యాలయం పెంటగాన్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా యూఎస్ మిలటరీ జాయింట్ స్టాఫ్‌కు చెందిన సుమారు 50 మంది సైనిక, పౌర సిబ్బందికి పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షలు నిర్వహించినట్లు ది న్యూయార్క్ టైమ్స్‌ను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణ నేపథ్యంలో అమెరికా వద్ద దీర్ఘశ్రేణి క్షిపణులు, పేట్రియట్ ఇంటర్సెప్టర్లు వంటి కీలక ఆయుధాల నిల్వలు తగ్గుతున్నాయంటూ ఇటీవల పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ కథనాల వెనుక రక్షణ శాఖలోని వ్యక్తులే సమాచారాన్ని అందించారా అన్నదానిపై దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలోనే మీడియాకు రహస్య సమాచారాన్ని అందించారా? ముఖ్యంగా అమెరికా వద్ద ఉన్న కీలక ఆయుధాల నిల్వలు గణనీయంగా తగ్గాయన్న వివరాలను వెల్లడించారా? అనే కోణంలో అధికారులు సిబ్బందిని ప్రశ్నించినట్లు సమాచారం.
ఆగస్టులో ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. జాయింట్ స్టాఫ్‌లో సుమారు 1,500 నుంచి 2,000 మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తుండగా.. వారిలో సుమారు 50 మందిని పరీక్షలకు గురిచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ మాత్రం అంతర్గత సిబ్బంది, దర్యాప్తు అంశాలపై మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారం లీక్ కావడాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని, అందుకు అనుగుణంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.