e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 15, 2021
Home టాప్ స్టోరీస్ ఆ శిల్పం రాణి రుద్రమదేనా?

ఆ శిల్పం రాణి రుద్రమదేనా?

ఆ శిల్పం రాణి రుద్రమదేనా?

పొలాసలో వీరగల్లు విగ్రహం రుద్రమదేవికి ప్రతీకలా ఉన్నదంటున్న చరిత్రకారులు
జగిత్యాల, ఏప్రిల్‌ 12 (నమస్తే తెలంగాణ): గుర్రంపై కూర్చున్న యోధురాలు.. శుత్రువుపై కత్తితో ప్రహారం చేసి, అతడిని రెండుగా ఖం డించి, ఎడమ చేతితో అతని తలను ఊడబెరుకుతున్నది. ఆమె అధిరోహించిన అశ్వం ముందు కాళ్లు, మరో అశ్వంపై ఉన్న సైనికుడిని తొక్కేస్తున్నాయి. ఆ యోధురాలి కుడికాలు, శత్రుపక్షం గుర్రం తలను అణిచివేస్తున్నది. దిగువన మరో శత్రుసైనికుడు కుప్పకూలాడు. యో ధురాలు ఛాతిపై కవచం, నడుము భాగంలో చురకత్తి ధరించినట్టు కనిపిస్తున్నది. ఆమె ఎక్కి నగుర్రం జీను భాగం, కళ్లెం చాలా గొప్పగా చెక్కినట్టు ఉన్నాయి. ఆయోధురాలి తల వెనుక నుంచి కటి ప్రాంతం వరకు పొడవుగా అల్లిన జడ, పైభాగంలోని మహారాజ చిహ్నమైన ఛత్రం ఆమె మహారాణి అనే భావనను కలిగిస్తున్నాయి.

ఆపైన కాకతీయుల శైవమతాన్ని చాటు తూ శివలింగం, సూర్య, చంద్రుల రూపాలు కనిపిస్తున్నాయి. జగిత్యాల జిల్లా పొలాసలో లభ్యమైన శిల్పం రాణిరుద్రమదేవి వీరత్వానికి ప్రతీకలా ఉన్నదని అంటున్నారు ప్రముఖ చరిత్రకారుడు, పబ్లిక్‌ రిసెర్చ్‌ ఫర్‌ హిస్టరీ, ఆర్కియాలజీ, అండ్‌ హెరిటేజ్‌ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాసన్‌. జగిత్యాల సమీపంలోని లక్ష్మీపూర్‌, పొలాస గ్రామాల్లో చారిత్రక అంశాలపై పరిశీలనలో పలు కీలక విగ్రహాలు, అరుదైన శిల్పాలను గుర్తించినట్టు చెప్పారు. పొలాస ఎల్లమ్మ గుడి సమీపంలోని కల్లుమండువ వద్ద వీరగల్లు శిల్పాన్ని పోలిన ఈ శిల్పం రాణిరుద్రమ వీరవిహారానికి సాక్ష్యమని భావిస్తున్నారు.

వీరగల్లు శిల్పాలకు భిన్నంగా పొలాస శిల్పం
సహజంగా వీరగల్లు శిల్పాలన్నీ ఒకేతీరుగా కనిపిస్తుంటాయి. కాకతీయ యుద్ధవీరులను వీరగల్లు శిల్పంగా మలచడం సహజమే. వీరగల్లు శిల్పాలన్నీ చురకత్తులు, డాలు, శరీరంపై కవచం ధరించినవే ఇంతవరకు రికార్డయ్యా యి. చాలా వీరగల్లులపై వారి పేర్లు సైతం లభ్యమయ్యాయి. వీరగల్లు శిల్పాల్లో, స్త్రీ, పురుషులిద్దరూ వెంట్రుకలను ముడివేసుకొని, కొప్పు రూపంలో అలంకరించుకొనే కనిపించారు. శిల్పాల పై భాగంలో సూర్య చంద్రులు, లేబుల్‌ శాసనాలు, శివలింగాలు, కొన్నిచోట్ల వరాహం గుర్తులు కనిపించాయి. అయితే పొలాస శిల్పం భిన్నంగా కనిపిస్తున్నదని శ్రీనివాసన్‌ చెప్తున్నారు. శిల్పాన్ని అందంగా మలచడం, ఛత్రం అమర్చడం, బారు జడను చూపించడం ఇవన్నీ ఆమె రాణి రుద్రమదేవి అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయని అంటున్నారు.

తెలంగాణలో తొలి బాహుబలి విగ్రహం
లక్ష్మీపూర్‌ శివారులోని గిద్దెవారి గుండుకు నాలుగు అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పుతో భారీ బాహుబలి విగ్రహం చెక్కించారని, బాహుబలికి లతలు, తీగెలు పెనవేసుకొని ఉన్నాయని శ్రీనివాసన్‌ తెలిపారు. విగ్రహం దిగువన సింహం బొమ్మలు, ఇరువైపులా తీర్థంకరులను చెక్కారని, గుండు మొత్తం జైన బసది ఆనవాళ్లు కనిపిస్తున్నాయన్నారు. ఇప్పటివరకు తీర్థంకరులు, జైన చక్రేశ్వరి విగ్రహాలే లభ్యమయ్యాయని, తొలిసారిగా బాహుబలి విగ్రహం జగిత్యాలలో వెలుగు చూసిందని చెప్పారు.

రుద్రమ విజయాలకు ప్రతీక
ఒకప్పుడు స్వతంత్ర రాజ్యంగా విరాజిల్లిన పొలాస.. రుద్రమ ఏలుబడిలో ఉండేదని శ్రీనివాసన్‌ అన్నారు. మొదటి ప్రతాపరుద్రుడు పొలాసను తన రాజ్యంలో కలుపుకొన్నాడని చాటేలా పలు శాసనాలున్నాయని తెలిపారు. రుద్రమదేవి విజయాలకు చిహ్నం గా పొలాస శిల్పం చెక్కి ఉండే అవకాశాలున్నాయన్నారు. లేదా రుద్రమ పట్లోధృతిగా పనిచేసిన సమయంలోని యుద్ధ విజయాలను చాటుతూ శిల్పం వేయించి ఉండవచ్చునని తెలిపారు. ఈ శిల్పం లభ్యమైన స్థలానికి సమీపంలోనే మరో మహిళ విగ్రహం దొరికింది. ముకుళిత హస్తాలతో ఉన్న విగ్రహం పై భాగంలో సూర్య, చంద్రుల బొమ్మలు, శంఖం, చక్రం చెక్కి ఉన్నాయి. శిల్పం ఎగువభాగంలో ఎడమ వైపున 13వ శతాబ్దం నాటి తెలుగు లిపిలో ‘శిఖరాల అప్పమ’ అని చెక్కి ఉన్నది.

ఇవీ కూడా చదవండి…

డాటాబేస్‌లోకి నేరస్థుల చిట్టా

మరో టీకా వస్తున్నది!

గంటన్నరలోనే ఎల్వోసీ మంజూరు

Advertisement
ఆ శిల్పం రాణి రుద్రమదేనా?
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement