e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home Top Slides మరో టీకా వస్తున్నది!

మరో టీకా వస్తున్నది!

మరో టీకా వస్తున్నది!
  • రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీకి అనుమతి!
  • డీసీజీఐకి నిపుణుల కమిటీ సిఫారసు
  • ఓకే అంటే.. దేశంలో ఆమోదం పొందిన మూడో వ్యాక్సిన్‌గా గుర్తింపు
  • 91.6 శాతం సమర్థత కలిగిన స్పుత్నిక్‌ వీ
  • ఒక్కో డోసు రూ.750.. నిల్వ చేయడం సులభమే

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 12: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో టీకాకు అనుమతి లభించనున్నది. వివిధ రాష్ర్టాల్లో టీకాల కొరత వేధిస్తున్న క్రమంలో ఐదు రకాల వ్యాక్సిన్లకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా రష్యాకు చెందిన కొవిడ్‌-19 టీకా ‘స్పుత్నిక్‌ వీ’ అత్యవసర వినియోగానికి షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేయాలని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీవో)కి చెందిన నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ).. భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)కి సిఫారసు చేసింది. డీసీజీఐ ఈ సిఫారసును ఆమోదిస్తే ఆక్స్‌ఫర్డ్‌-సీరమ్‌ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్‌’, భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ తర్వాత భారత్‌లో అనుమతి పొందిన మూడో టీకాగా ‘స్పుత్నిక్‌ వీ’ నిలువనున్నది.

నిల్వ సులభం

‘స్పుత్నిక్‌ వీ’ వ్యాక్సిన్‌ని ‘అడినో వైరల్‌ వెక్టార్‌’ (జలుబును కలుగజేసే వైరస్‌ బలహీన రూపం) ఆధారంగా అభివృద్ధి చేశారు. ఈ వైరస్‌ ఆధారంగా అభివృద్ధి చేసిన టీకాలు సురక్షితమైనవని, ఎంతో సమర్థతను కనబరుస్తాయని, దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు కూడా చాలా తక్కువని గత రెండు దశాబ్దాల్లో నిర్వహించిన దాదాపు 250 అధ్యయనాలు రుజువుచేశాయి. అలాగే, ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్‌లలో 90 శాతం కంటే ఎక్కువ సమర్థత కలిగిఉన్న టీకాలు కేవలం మూడే. అందులో స్పుత్నిక్‌ వీ కూడా ఒకటి. (ఫైజర్‌ టీకా 95 శాతం, మోడెర్నా వ్యాక్నిన్‌ 95 శాతం సమర్థతను కలిగి ఉన్నాయి). మరోవైపు, స్పుత్నిక్‌ వీ టీకాను రిఫ్రిజిరేటర్‌ ఉష్ణోగ్రత వద్ద (2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌) నిల్వ చేయవచ్చు. టీకా ఒక్కో డోసు ఖరీదు 10 డాలర్లు (దాదాపు రూ.750)

60 దేశాల్లో అనుమతి

స్పుత్నిక్‌ వీ టీకాకు 60 దేశాల్లో అనుమతులు లభించాయి. ఆక్స్‌ఫర్డ్‌ టీకా (83 దేశాల్లో అనుమతులు), ఫైజర్‌ టీకా (82 దేశాల్లో అనుమతులు) తర్వాత అత్యధిక దేశాల్లో అనుమతులు పొందిన వ్యాక్సిన్‌గా ‘స్పుత్నిక్‌ వీ’ నిలిచింది. స్పుత్నిక్‌ వీ 12.5 కోట్ల డోసులను భారత్‌లో విక్రయించేందుకు రెడ్డీస్‌ ల్యాబ్‌ ఆర్డీఐఎఫ్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. రెడ్డీస్‌తో పాటు హెటిరో, గ్లాండ్‌ ఫార్మా తదితర కంపెనీలతో కూడా ఆర్డీఐఎఫ్‌ ఒప్పందం చేసుకున్నది.

రెడ్డీస్‌తో ఒప్పందం

రష్యాకు చెందిన రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్డీఐఎఫ్‌) ‘స్పుత్నిక్‌ వీ’ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ టీకాపై భారత్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపేందుకు, విక్రయించేందుకు హైదరాబాద్‌ ఫార్మా సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌తో గతేడాది సెప్టెంబర్‌లో ఒప్పందం చేసుకుంది. ట్రయల్స్‌ సమాచారాన్ని ఇటీవలే సీడీఎస్‌సీవోకు పంపిన రెడ్డీస్‌ సంస్థ.. అనుమతుల మంజూరుకు దరఖాస్తు చేసింది.

టీకా వేసుకొన్నా వైరస్‌ వ్యాప్తి
ఇమ్యునాలజిస్టులు వినీతా బాల్‌, సత్యజిత్‌ రథ్

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 12: వ్యాక్సిన్‌ వేసుకొన్నవారి నుంచి కూడా కరోనా వ్యాపిస్తుందని.. కాబట్టి వారు కూడా కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇమ్యూనాలజిస్టు వినీతా బాల్‌ స్పష్టంచేశారు. టీకా వేసుకుంటున్న వారిలో పలువురు కొవిడ్‌ నిబంధనలను పాటించకపోవడంపై ఆమె ఈ హెచ్చరికలు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ వ్యాక్సిన్‌ కూడా కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోలేదని, వైరస్‌ సోకిన వ్యక్తిలో వ్యాధి తీవ్రం కాకుండా మాత్రమే టీకా కాపాడుతుందన్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీ శాస్త్రవేత్త సత్యజిత్‌ రథ్‌ మాట్లాడుతూ.. ‘మహమ్మారి నియంత్రణ కోసం ఉన్న భిన్నమైన వ్యూహాల్లో వ్యాక్సిన్‌ ఒకటి. అంతే తప్ప అదే పరిష్కారం కాదు’ అని చెప్పారు. వ్యాక్సిన్‌ అనేది వ్యక్తిగత రక్షణ కోసమేనన్నారు.
కరోనా వ్యాప్తి, కట్టడి చర్యలపై గుజరాత్‌ ప్రభుత్వం చెప్తున్నదానికి రాష్ట్రంలో వాస్తవ పరిస్థితికి అసలు పొంతనే లేదు. కొవిడ్‌ నిబంధనల అమలుకు సర్కారు తగు చర్యలు తీసుకోవట్లేదు. ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. దేవుడిపైనే భారం వేస్తున్నారు. కరోనా కట్టడికి ఇకనైనా కఠిన చర్యలు అమలు చేయాలి.
-గుజరాత్‌ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం

  • ఢిల్లీ యువతపై కరోనా పంజా
  • బాధితుల్లో 45 ఏండ్లలోపు వారే ఎక్కువ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 12: ఢిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్న ఫోర్త్‌ వేవ్‌ వైరస్‌ ఉద్ధృతి 30-50 ఏండ్ల మధ్య వయసున్న వారిపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాధితుల్లో 65 శాతం కంటే ఎక్కువమంది 45 ఏండ్లలోపు వారేనని పేర్కొన్నారు. వైరస్‌ బారినపడినవారిలో జ్వరం ఎక్కువగా ఉన్నట్టు తాము గమనించామని ఢిల్లీలోని అపోలో దవాఖాన వైద్యుడు సురంజిత్‌ చటర్జీ పేర్కొన్నారు. ప్రజల్లో యాంటీబాడీల వృద్ధిని తెలుసుకునేందుకు ఆరో దఫా సెరోలాజికల్‌ సర్వేను సోమవారం ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. కేసుల పెరుగుదల దృష్ట్యా కార్యాలయాలు, మెట్రో, బస్సు సర్వీసులు 50 శాతం సామర్థ్యంతో మాత్రమే పనిచేయాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదేశించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మరో టీకా వస్తున్నది!

ట్రెండింగ్‌

Advertisement