అంబర్‌పేట, అక్టోబర్ 2: మూసీ కూల్చివేతల భయం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నది. కుటుంబానికి పెద్ద దిక్కును పొట్టన పెట్టుకున్నది. కూల్చివేతలకు ముందే ఆ కుటుంబం రోడ్డున పడింది. మొన్న కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేతల భయంతో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంటే.. తాజాగా, ఎక్కడ తన ఇంటిని కూల్చివేస్తారోనని గుండెపోటుతో మరణించాడో వ్యక్తి. అంబర్‌పేట మండల పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతమైన న్యూ తులసీరాంనగర్(లంక)కు చెందిన గానద శ్రీకుమార్ (51) మేస్త్రీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి ముగ్గురు సంతానం.
గత కొన్ని రోజులుగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇండ్లను కూల్చివేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుండడంతో కుమార్ మనోవేదనకు గురవుతున్నాడు. నాలుగైదు రోజులుగా తిండి మానేశాడు. తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఛా తీలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే అంబులెన్స్‌లో దవాఖానకు తీసుకెళ్తుండా, మార్గమధ్యంలోనే గుండెనొప్పి వచ్చి చనిపోయాడు. మూసీ కూల్చివేతలు ఏమో కానీ.. ప్రభుత్వం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నదని బస్తీవాసులు ఆరోపించారు.
న్యూతులసీరాంనగర్ (లంక)లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పర్యటించారు. మూసీ బాధితులను పరామర్శించి ప్రజల బాధలను అడిగి తెలుసుకున్నారు. శ్రీకుమార్ ఇంటికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూల్చివేతలతో ఆందోళన చెందిన శ్రీకుమార్ చనిపోయాడని, ఇది ముమ్మూటికీ ప్రభుత్వ హత్యే అని అన్నారు. కుమార్ కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పేదల ఇండ్ల కూల్చివేతకు సీపీఎం వ్యతిరేకమని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి స్పష్టం చేశారు. సీపీఎం హైదరాబాద్ సౌత్కమిటీ ఆధ్వర్యంలో చాదర్‌ఘాట్‌లోని మూసానగర్, శంకర్‌నగర్‌లో ప్రభుత్వం కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వ కండ్లుతెరచి పేదలకు న్యాయం చేయాలని, లేకుంటే పోరాటాడుతామని హెచ్చరించారు.