హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. నిన్న, మొన్నటి దాకా శిథిలావస్థలో కునారిల్లిన పాఠశాలలు సైతం నేడు అధునాతన హంగులతో కొత్త సొగసును సంతరించుకుంటున్నాయి. చూడముచ్చటైన తరగతి గదులు…. క్లాస్‌రూంలో డ్యూయల్ డెస్క్‌లు.. విద్యుత్తు వెలుగులు.. పరిశుభ్రమైన టాయిలెట్లు.. స్వచ్ఛమైన మంచినీళ్ల ట్యాంక్‌లు.. వంటగదులు.. భోజనశాలలు.. వాకింగ్ ట్రాక్‌లు.. చుట్టూ ప్రహరీలు.. ఇలా అనేక సదుపాయాలతో విద్యార్థులు ఏకాగ్రతతతో నిశ్చింతగా చదువులు కొనసాగించేందుకు అవసరమైన ఆహ్లాదకర వాతావారణాన్ని పంచిపెడుతున్నాయి. పిల్లల చదువులకు సరికొత్త భరోసాను అందిస్తున్నాయి. అసలు సిసలు సరస్వతీ నిలయాలుగా రూపుదిద్దుకుంటున్నాయి.