హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): సినీ నటుడు నవదీప్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 10న తమ ఎదుట తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. 2017లో సంచలనం సృష్టించిన భారీ డ్రగ్ రాకెట్ కేసు, తాజాగా గుడిమల్కాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌కు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. గుడిమలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర యాంటీ నారోటిక్స్ బ్యూరో ఇటీవల నవదీప్‌ను విచారించింది.
సెప్టెంబర్ 14న బెంగళూరులో పట్టుబడిన నైజీరియన్ డ్రగ్ పెడ్లర్లతో నవదీప్‌కు పరిచయం ఉన్నదని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో నవదీప్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు అందజేశారు. పాత టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సమన్లు పంపినా.. ప్రస్తుత కేసును అందులో చేర్చామని, ఈ రెండు కేసులపై నవదీప్‌ను పూర్తిస్థాయిలో విచారించనున్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి.