హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కీలకమైన ఇంధనశాఖ ముఖ్య అధికారులుగా వచ్చి వారెవరూ ఎక్కువకాలం ఉండటం లేదు. ఇలా వచ్చి అలా కుదురుకోగానే బదిలీ అవుతున్నారు. ఏడాదిన్నర కాలంలో ఈ శాఖకు నలుగురు ప్రిన్సిపల్ సెక్రటరీలు మారడం గమనార్హం. తాజాగా ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌ను సర్కారు నియమించింది. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరే వరకు ఈ శాఖకు తొలుత సునీల్‌శర్మ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండేవారు.
ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి ఎస్ఏఎం రిజ్వీని ప్రభుత్వం కొత్త ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. కొంత కాలానికి ఆయనను బదిలీచేసి రోనాల్డ్ రోస్‌ను సర్కార్ నియమించింది. ఆయన ఏపీకి బదిలీ కావడంతో ఆయన స్థానంలో సందీప్‌కుమర్ సుల్తానియాకు బాధ్యతలను అప్పగించారు. తాజాగా ఐఏఎస్ బదిలీల్లో కీలకమైన ఈ ఇంధన శాఖ ముఖ్య అధికారిగా నవీన్‌మిట్టల్ నియమితులయ్యారు.
విద్యుత్తు సంస్థలైన టీజీ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీల విషయంలోను ఇదే తంతు జరుగుతున్నది. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తర్వాత ఐఏఎస్ అధికారి రిజ్వీయే రెండు శాఖలకు సీఎండీగా వ్యవహరించారు. ఆయన బదిలీ అయ్యాక మరో ఐఏఎస్ రోనాల్డ్ రోస్ రెండు సంస్థలకు సీఎండీగా పనిచేశారు. కొంతకాలానికి టీజీ ట్రాన్స్‌కోకు కృష్ణభాస్కర్ సీఎండీగా నియమితులయ్యారు. జెన్కో సీఎండీగా సందీప్‌కుమార్ సుల్తానియా పనిచేశారు. కొంతకాలం క్రితం హరీశ్‌ను జెన్కో సీఎండీగా నియమించారు. ప్రస్తు తం కృష్ణభాస్కర్ ట్రాన్స్‌కో సీఎండీగా, హరీశ్ జెన్కో సీఎండీగా నియమితులయ్యారు.