Mancherial | జైపూర్, సెప్టెంబర్ 10: విద్యుత్తు సిబ్బంది చొరవ తీసుకొని చెరువులో ఉన్న కరెంట్ స్తంభంపై మరమ్మతులు చేపట్టి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామానికి కరెంట్ సరఫరా చేసే 11 కేవీ లైన్ చెరువు మీదుగా వెళ్లింది.
వర్షానికి శనివారం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చెరువులోనున్న స్తంభంపై ఇన్సులేటర్ ఫెయిల్ అయినట్టు గుర్తించారు. ఓ వైపు చినుకులు పడుతున్నా.. లైన్‌మన్ రాజమల్లు, జూనియర్ లైన్‌మన్ కిషన్ నడుములోతు నీటిలో నుంచి స్తంభం వద్దకు చేరుకున్నారు. ఒకరు నిచ్చెన పట్టుకోగా, మరొకరు దానిపై నుంచి స్తంభం ఎక్కి మరమ్మతులు చేపట్టి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. ప్రత్యేక చొరవ తీసుకొని మరమ్మతులు పూర్తిచేసిన రాజమల్లు, కిషన్‌ను ఏడీఈ రవికుమార్, గ్రామస్థులు అభినందించారు.